PIC Credit : BCCI
Abhishek Sharma century : జింబాబ్వే పర్యటనలో భారత జట్టు బోణీ కొట్టింది. మొదటి టీ20 మ్యాచులో అనూహ్యంగా పరాజయాన్ని చవిచూసిన టీమ్ఇండియా రెండో టీ20 మ్యాచ్‌లో తన పంజా విసిరింది. 100 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారత జట్టు విజయంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాది శతకాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో అభిషేక్ పలు రికార్డులను అందుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది సెంచరీ పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. టీమ్ఇండియా తరుపున అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే తొలి టీ20 సెంచరీ బాదిన ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. అభిషేక్‌కు ఇది రెండో ఇన్నింగ్స్ మాత్రమే. గతంలో ఈ రికార్డు దీపక్ హుడా పేరిట ఉండేది. హుడా తన అరంగ్రేటం నుంచి మూడో ఇన్నింగ్స్‌లో శతకం బాదాడు.
టీమ్ఇండియా తరుపున టీ20ల్లో శతకం బాదిన ఐదో పిన్న వయస్కుడిగా అభిషేక్ నిలిచాడు. 23 ఏళ్ల 307 రోజుల వయసులో అభిషేక్ సెంచరీ చేశాడు. ఈ జాబితాలో యశస్వి జైస్వాల్ 21 ఏళ్ల 279 రోజులు తొలి స్థానంలో ఉన్నాడు. ఇక భారత్ తరుపున టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ కేవలం 38 బంతుల్లోనే శతకాన్ని బాదాడు. ఆ తరువాత సూర్యకుమార్ యాదవ్ (45), కేఎల్ రాహుల్(46), అభిషేక్ శర్మ(46) లు ఉన్నారు.
కాగా.. తొలి టీ20 మ్యాచులో అభిషేక్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 33 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్న అతడు ఆ తరువాత శతకాన్ని అందుకోవడానికి మరో 13 బంతులే తీసుకున్నాడు.
ఆ కసితో బరిలోకి దిగా..
మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ఇది తన అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పాడు. తొలి టీ20లో ఎదురైన ఓటమిని తట్టుకోలేకపోయినట్లుగా చెప్పాడు. ఈ క్రమంలోనే రెండో టీ20లో ఎలాగైనా రాణించాలనే కసితో బరిలోకి దిగినట్లు చెప్పాడు. కోచ్, కెప్టెన్, టీమ్‌మేనేజ్‌మెంట్ తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశారని తెలిపాడు. ఇక మ్యాచ్‌లో ప్రతి ఓవర్ ముగిసిన తరువాత రుతురాజ్‌తో మాట్లాడుతూనే ఉన్నాను. ‘నా శైలిలోనే ఆడమని అతడు చెప్పాడు. బంతి నా జోన్‌లో పడితే బౌండరీకి పంపిస్తాను. అది తొలి బంతి అయినా కూడా అలాగే ఆడతాను.’ అని అభిషేక్ అన్నాడు.