Year Ender 2023: టీమిండియా 2023లో ఎన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిందో తెలుసా? మూడు ఫార్మాట్లలో విజయాలు ఎన్నంటే..

భారత్ జట్టు ఈ ఏడాది రెండు ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్ మ్యాచ్ లలో పాల్గొంది. జూన్ లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా ఆడింది. నవంబర్ నెలలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు ఆడింది.

TeamIndia

Team India : ఈ ఏడాది టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్ లలో మెరుగైన ఫలితాలను రాబట్టింది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మరోసారి వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలుస్తుందని భావించిన అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మినహా మిగిలిన మ్యాచ్ లలో టీమిండియా ఈ ఏడాది మెరుగైన ఫలితాలనే రాబట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా వన్డేల్లో టీమిండియా అద్భుతంగా రాణించింది.. టీ20ల్లోనూ మంచి ప్రదర్శనను కనబర్చింది. టెస్టు మ్యాచ్ విజయాల్లో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో భారత్ జట్టు రాణించలేదని గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.

భారత్ జట్టు ఈ ఏడాది రెండు ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్ మ్యాచ్ లలో పాల్గొంది. జూన్ లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా ఆడింది. నవంబర్ నెలలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు ఆడింది. అయితే, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయి క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. 2013 సంవత్సరం తర్వాత ఐసీసీ ట్రోపీని గెలవాలన్న తొమ్మిదేళ్ల కల ఏడాది నెరవేరుతుందని అందరూ భావించారు. కానీ, ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు ఓడిపోవటంతో క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 26 నుంచి భారత్ జట్టు టెస్ట్ సిరీస్ ఆడబోతుంది. రెండు టెస్టుల్లో భాగంగా తొలి టెస్టు మంగళవారం ప్రారంభం అవుతుంది. టీమిండియాకు 26 నుంచి ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్ నే ఈఏడాది చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుంది. 2023లో భారత్ జట్టుకు మూడు ఫార్మాట్లలో కలిపి ఇది 66వ మ్యాచ్. గత 65 మ్యాచ్ లలో భారత్ జట్టు 45 మ్యాచ్ లలో విజయాలు సాధించి.. కేవలం 16 మ్యాచ్ లలోనే ఓటమి చవిచూసింది. మరో రెండు మ్యాచ్ లు డ్రా కాగా, రెండు మ్యాచ్ లు అసంపూర్తిగా ముగిశాయి.

2023లో టీమిండియా టెస్ట్ రికార్డును పరిశీలిస్తే.. భారత్ జట్టు మొత్తం ఏడు టెస్టు మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ లు, వెస్టిండీస్ తో రెండు మ్యాచ్ లు ఆడింది. ఈ ఏడు మ్యాచ్ లలో కేవలం మూడు మ్యాచ్ లలోనే టీమిండియా విజయం సాధించింది. రెండు మ్యాచ్ లు డ్రా కాగా, రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఏడాది మొత్తంలో టీమిండియా టెస్ట్ రికార్డు యావరేజ్ గా ఉందనే చెప్పొచ్చు.

వన్డే ఫార్మాట్ లో టీమిండియా ఈ ఏడాది అద్భుత ప్రదర్శన ఇచ్చింది. మొత్తం 35 వన్డే మ్యాచ్ లు ఆడగా.. 27 మ్యాచ్ లలో విజేతగా నిలిచింది. కేవలం ఏడు మ్యాచ్ లలోనే పరాజయం పాలైంది. ఒక మ్యాచ్ రద్దయింది.

టీ20ల్లో ఈ ఏడాది భారత్ జట్టు ప్రదర్శన మెరుగ్గానే ఉంది. మొత్తం 23 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన భారత్ జట్టు.. 15 మ్యాచ్ లలో విజయం సాధించి.. ఏడు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ రద్దయింది. ఓవరాల్ గా భారత్ జట్టు వన్డే, టెస్ట్, టీ20 ఫార్మాట్ లలో మెరుగైన ప్రదర్శనే ఇచ్చిందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.