Team India squad announcement for Asia Cup 2025 today
India Asia Cup 2025 : సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టు(India Asia Cup 2025)లో ఎవరికి చోటు దక్కుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నేడు (ఆగస్టు 19 మంగళవారం) సమావేశం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టీ20 ప్రపంచకప్ జరగనుండంతో ప్రస్తుత ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. దీంతో ఆ మెగా టోర్నీకి ఆసియా కప్ సన్నాహంగా మారనుంది.
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌లు జట్టులో చోటుదక్కించుకుంటారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరు టీమ్ఇండియా తరుపున టీ20 మ్యాచ్ ఆడి దాదాపుగా ఏడాది దాటిపోయింది. టీమ్ఇండియా ఆడిన 12 టీ20 మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేశారు.
దీంతో ఈ ఓపెనింగ్ కాంబినేషన్‌ను విడగొట్టే సాహసం సెలక్టర్లు చేయకపోవచ్చు. ఈ క్రమంలో మూడో ఓపెనర్‌గా గిల్, యశస్విలో ఒకరే ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఇక వీరిద్దరి మధ్య రేసులో జైస్వాల్ కాస్త ముందున్నట్లు తెలుస్తోంది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 లో కూడా జైస్వాల్ రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కేవలం మూడు టెస్టులే ఆడాడు. ఈ క్రమంలో అతడు ఆసియా కప్ బరిలో ఉండడం కష్టమే అన్న వార్తలు వచ్చాయి. కానీ తాను సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని స్వయంగా బుమ్రా వెల్లడించాడు. దీంతో అతడు భారత బౌలింగ్ దళానికి నాయకత్వం వహించవచ్చు. అతడికి తోడుగా అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ద్‌కృష్ణ లు పేస్ భారాన్ని పంచుకోవచ్చు.
మహ్మద్ సిరాజ్‌కు చోటు కష్టమే. ఇక గతేడాది 5 టీ20 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమే.
Rinku Singh : తొలి బంతికే వికెట్ తీసిన రింకూ సింగ్.. వామ్మో ఆ ఆవేశం ఏందీ బ్రో.. వీడియో
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లు మిడిల్ ఆర్డర్‌లో చోటు దక్కించుకోనున్నారు. ఇక హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ, రింకూ సింగ్‌లను కూడా జట్టులోకి రావొచ్చు. ఆల్‌రౌండ్ విభాగంలో శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్‌లో ఒకరి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ మరికొంత కాలం ఎదురుచూడక తప్పలా లేదు. రెండో వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మను తీసుకోవచ్చు. ఐపీఎల్‌లో అతడు వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటర్‌గానూ రాణించాడు.