ఒక కపిల్ దేవ్.. ఓ దాదా.. ఓ ధోనీ… క్రికెట్ చరిత్రలో వాళ్లు రాసిన చరిత్రలు అటువంటివి.. అయితే ఏముంది ఎంత ఎదిగిన వాళ్లైనా వాళ్ల టైమ్ వచ్చాక తప్పుకోక తప్పదు.. కాలచక్రం ఆగదు కదా? ఇప్పుడు ధోనీ పరిస్థితి కూడా అదే.. ఆల్మోస్ట్ అనధికారికంగా అంతర్జాతీయ క్రికెట్‌కి ధోనీ రిటైర్మెంట్ ఇచ్చినట్లే. అందులో ఏ మాత్రం సందేహం లేదు. వరల్డ్ కప్ అయిపోగానే ధోనీ క్రికెట్‌కు స్వస్తి చెప్పేస్తాడని అందరూ భావించారు. అయితే అనుకున్నట్లుగా జరగలేదు. తనంతట తానే గౌరవంగా, హుందాగా, తలెత్తుకుని, చప్పట్ల నడుమ గ్రౌండ్ వీడి వెళ్లిపోవడానికి అప్పుడు అవకాశం దొరకలేదు. సెమీ ఫైనల్లోనే భారత్ ఇంటిముఖం పట్టడంతో అటువంటి అవకాశం దక్కలేదు. ఇక అప్పటి నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ధోనీ.
అయితే ఎప్పటికైనా మళ్లీ వస్తాడు.. వచ్చే టోర్నీలో మళ్లీ వచ్చేస్తాడు.. అని ఎదురుచూసిన అభిమానులకు చివరకు నిరాశే మిగిలేలా మహేంద్రసింగ్ ధోనీ కెరీర్ ముగిసిపోయినట్లుగా బీసీసీఐ లేటెస్ట్‌గా గట్టి సంకేతాలు ఇచ్చేసింది. ప్రతీ ఏటా.. ఆటగాళ్లకు ఇచ్చే కాంట్రాక్టుల్లో ఈ సారి ధోనీ పేరు మిస్ అయింది. కాదు మిస్ చేసింది బీసీసీఐ. అంటే ఇక మీ సేవలు మాకు అక్కర్లేదు అని చెప్పినట్లే లెక్క. ఆటగాళ్లకు నాలుగు కేటగిరీల్లో బీసీసీఐ కాంట్రాక్టులు ఇస్తుంది. ఏ ప్లస్ , ఏ, బీ, సీ అనే కేటగిరీల్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు ఏడాది పాటు జీతం ఇస్తుంది.
అయితే ఇప్పుడు ఏ ప్లస్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా మాత్రమే చోటు దక్కించుకున్నారు. వీరికి ఏడాదికి ఏడు కోట్లు ఇస్తారు. 5 కోట్ల గ్రేడ్ ఏ జాబితాలో రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, చటేశ్వర్ పూజారా, అజింక్య రెహానే, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మొహమ్మద్ షమి, ఇశాంత్ శర్మ, కులదీప్ యాదవ్, రిషబ్ పంత్… 3 కోట్ల విలువైన బీ జాబితాలో 5 మంది, కోటి రూపాయల విలువైన సీ జాబితాలో 8 మంది ఉన్నారు. అందులో ఎందులోనూ ధోనీ లేడు.
గత ఏడాది ధోనీకి ఏ కేటగరిలో చోటు కల్పించింది బీసీసీఐ. ఈ ఏడాది అక్కడ కూడా చోటు ఇవ్వలేదు. కంట్రాక్టులు, ఏజెన్సీలు, ప్రచారాలు, బ్రాండ్లతో ఎంతో సంపాదించిన ధోనీకి బీసీసీఐ ఇచ్చే వేతనం సమస్య కాదు. కానీ గౌరవం అనేదే ముఖ్యం. కానీ పక్కకెళ్లు అంటూ బీసీసీఐ గట్టిగా అనేయడమే ఇప్పుడు వచ్చిన సమస్య. ఓ వైపు టీమిండియాలో నిలకడగా రాణించే కీపర్ లేరు. ఇటువంటి సమయంలో ధోనీని పక్కన పెట్టేశారు. వన్డే వరల్డ్ కప్పు, టీ20 వరల్డ్ కప్పుతోపాటు భారత్ తరుపున కూల్ కెప్టెన్, బెస్ట్ ఫినిషర్ అంటూ పేరు తెచ్చుకున్న ధోనీ రిటైర్మెంట్ అంటే మాములుగా ఉండకూడదు. సగటు క్రికెట్ అభిమాని అయినా రాబోయే కాలంలో వచ్చే ప్లేయర్లు అయినా కోరుకునేది అదే.
అయితే ధోనీ ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ ఇవ్వరు. త్వరలో ఐపీఎల్ ఉంది. అందులో చెన్నై సూపర్ కింగ్స్‌కి అతనే కెప్టెన్. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ ఉంది. అందులో ధోనీకి ఆడే అవకాశం ఇచ్చి ఒక లెజెండరీ క్రికెటర్‌ని లెజెండ్ లాగే బయటకు పంపించాలనేది సగటు అభిమాని అభిప్రాయం. అయితే ఇప్పుడు బీసీసీఐ ఇచ్చిన గ్రేడుల్లో ధీనీకి స్థానం ఇవ్వకపోవడంతో అసలు బీసీసీఐ నిర్ణయం ఏంటో అర్థ కావట్లేదు. చూడాలి మరి..!!
ఇక ఇదే సమయంలో #ThankYouDhoni అంటూ ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.