వార్నర్ విధ్వంసం.. తగ్గేదేలే అంటూ దంచికొట్టిన బెయిర్‌స్టో.. చివరిలో బిగ్ ట్విస్ట్.. విజేతగా నిలిచిన విలియమ్సన్ జట్టు

లండన్ స్పిరిట్ vs వెల్ష్‌ఫైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో లండన్ స్పిరిట్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది.

Warner

The Hundred 2025: ద హండ్రెడ్ లీగ్-2025లో లండన్ స్పిరిట్‌కు ఆడుతున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చాలాకాలం తరువాత మైదానంలో గర్జించాడు. సిక్సులు, ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. శనివారం వెల్ష్‌‌ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తద్వారా కేవలం 45 బంతుల్లో 70 పరుగులు చేశాడు.

ఇంగ్లాండ్‌లో జరిగిన ది హండ్రెడ్ లీగ్ 6వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో వెల్ష్‌ఫైర్ జట్టు, లండన్ స్పిరిట్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన వెల్ష్‌ఫైర్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. లండన్ స్పిరిట్ జట్టు బ్యాటింగ్ మొదలు పెట్టింది. ఆ జట్టుకు అనుభవజ్ఞుడైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. 45 బంతులు ఎదుర్కొన్న వార్నర్ రెండు సిక్సులు, ఎనిమిది ఫోర్ల సహాయంతో అజేయంగా 70పరుగులు చేశాడు.


వార్నర్ మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 14, జెమీ స్మిత్ 26, ఆస్టన్ టర్నర్ 24, సీన్ డిక్సన్ 14 పరుగులు చేశారు. అయితే, వార్నర్ అద్భుతమైన అర్ధం సెంచరీతో లండన్ స్పిరిట్ జట్టు 100 బంతుల్లో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. వెల్ష్ ఫైర్ బౌలర్లలో జోష్ హల్ రెండు వికెట్లు తీయగా.. డేవిడ్ పేన్, రిలే మెరిడిత్ చెరో వికెట్ పడగొట్టారు.


భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో వెల్ష్ ఫైర్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. మొదటి ఓవర్ నుంచే వేగంగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా జానీ బెయిర్ స్టో 50బంతుల్లో ఆరు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 86 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కానీ, మరో ఎండ్‌లో బెయిర్‌స్టోకు సరియైన మద్దతు లేకపోవడంతో వెల్ష్ ఫైర్ జట్టు 100 బంతుల్లో ఆరు వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని లండన్ స్పిరిట్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.


వెల్ష్ ఫైర్ ఇన్నింగ్స్ లో బెయిర్ స్టో, గ్రీన్ మినహా ఎవరూ రాణించలేక పోయారు. స్టీవ్ స్మిత్ (3), లూక్ వెల్స్ (12), టామ్ ఏబెల్ (5), టామ్ కొహ్లెర్ (4), సైప్ జైబ్ (2), పాల్ వాల్టర్ (6) పరుగులకు ఔట్ అయ్యారు. అయితే, స్పిరిట్ బౌలర్లలో డేనియల్ వార్రల్ రెండు, లూక్ వుడ్, రిచర్డ్ గ్లీసన్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

స్కోర్ బోర్డు..
లండన్ స్పిరిట్ 163-5 (100 బంతులు) : వార్నర్ 70* (45); హల్ 2-36,
వెల్ష్ ఫైర్ 155-6 (100 బంతులు): బెయిర్‌స్టో 86* (50); వొరాల్ 2-31
లండన్ స్పిరిట్ ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది.