There is a huge difference between me and Abhishek Sharma says Sunil Gavaskar
Sunil Gavaskar : టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పై టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. నాగ్‌పూర్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అభిషేక్ చెలరేగి ఆడాడు. 35 బంతుల్లోనే 84 పరుగులు సాధించాడు. ఇక కేవలం 22 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీ చేశాడు. అభిషేక్ విధ్వంసం కారణంగా భారత్ భారీ స్కోరు సాధించింది. బౌలర్లు కూడా రాణించడంతో తొలి టీ20 మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో గెలుపొంది 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆధునిక బ్యాటర్లకు, తన తరం మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని సునీల్ గవాస్కర్ హైలెట్ చేశాడు. తాను మొదటి పరుగు చేయడానికి ఎన్ని బంతులు తీసుకుంటానో.. అన్ని బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మా ఇద్దరి మధ్య ఉన్న తేడా ఇదేనని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ సునీల్ గవాస్కర్ తెలిపారు.
ఇక మ్యాచ్ అనంతరం తన బ్యాటింగ్ పై అభిషేక్ శర్మ మాట్లాడాడు. తన అమ్ములపొదలో ఎక్కువ క్రికెట్ షాట్లు లేవన్నాడు. నాకు ఎక్కువ షాట్లు ఆడడం రాదు. నేను కొన్నింటిని మాత్రమే ఆడగలను. అయితే.. వాటినే బాగా ప్రాక్టీస్ చేస్తుంటాను అని అభిషేక్ చెప్పాడు.
బ్యాటింగ్ చేసేటప్పుడు తన తొలి ప్రాధాన్యం జట్టుకే అని చెప్పాడు. తొలి ఆరు ఓవర్లను జట్టు సమర్థవంతంగా వినియోగించుకోవాలని అనుకుంటుంది. అందుకు తగ్గట్లుగానే తాను ప్రాక్టీస్ చేస్తుంటానని చెప్పుకొచ్చాడు. అన్ని జట్ల ప్రధాన బౌలర్లు మొదటి మూడు ఓవర్లను వేస్తుంటారని, వారి ఓవర్లలో పరుగులు సాధిస్తే మ్యాచ్‌లో పై చేయి సాధించవచ్చునని చెప్పాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అభిషేక్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఆ తరువాత 239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది.