కుల్దీప్ యాదవ్‌ను ఆడించాల్సిందే: మైఖేల్ క్లార్క్, నిక్ నైట్

"పిచ్ కొంచెం సహకరిస్తే కుల్దీప్ అన్ని రకాల వర్షన్స్‌తో ఇంగ్లాండ్‌ను ముప్పుతిప్పలు పెడతాడు" అని నిక్ నైట్ చెప్పారు.

Kuldeep Yadav

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా బౌలింగ్‌లో రాణించలేకపోయింది. జస్ప్రిత్ బుమ్రా 5 వికెట్లు తీసినప్పటికీ, ఇంగ్లాండ్‌ బ్యాటర్లను కట్టడి చేయడంలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా విఫలమయ్యారనే చెప్పుకోవాలి. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో తమ ముందు ఉన్న 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ ఛేదించింది.

దీనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నెక్స్ట్ మ్యాచుల్లో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలన్నారు. “నేను ఎవరి మీదా విమర్శ చేయను, కానీ కుల్దీప్‌ను ఆడించాలి. ఇందులో ఆలోచించడానికి మరేమీ లేదు. అతడికి వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. ఈ టెస్టులో మనం ఇప్పటివరకు చూసిన బౌలింగ్‌ కంటే కుల్దీప్ బాగా బౌలింగ్ వేయగలడు” అని క్లార్క్ చెప్పాడు.

Also Read: “నా పేరుతో ఫేక్ న్యూస్.. ఆ వార్తలను అస్సలు నమ్మకండి”.. అభిమానులకు సునీల్ గవాస్కర్ సీరియస్ వార్నింగ్..

“జట్టులో అదనపు బ్యాటింగ్‌ సామర్థ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల ప్రధాన స్పిన్నర్‌ను ఎంపిక చేయడం లేదు. భారత్ ఈ పద్ధతినే చాలాసార్లు పాటిస్తోంది. కానీ, ఇంగ్లాండ్‌లో గెలవాలంటే 20 వికెట్లు తీయడంపైనే దృష్టి పెట్టాలి” అని క్లార్క్ స్పష్టం చేశాడు.

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ నైట్ కూడా కుల్దీప్‌ను జట్టులోకి తీసుకోవాలని అన్నారు. “జట్టులో చాలా తక్కువ అవకాశం ఉన్నా కుల్దీప్‌ను ఆడించాల్సిందే. ఇంగ్లాండ్ ఆటగాళ్లు అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టమే. అతడు ఫామ్‌లో ఉంటే ఇదే సిరీస్‌ను తారుమార్చే కీలక ఘట్టం అవుతుంది. ఇంగ్లాండ్ బాగా ఆడింది. ధాటిగా ఆడాలంటే బౌలింగ్‌ గురించి పూర్తి అవగాహన అవసరం. పిచ్ కొంచెం సహకరిస్తే కుల్దీప్ అన్ని రకాల వర్షన్స్‌తో ఇంగ్లాండ్‌ను ముప్పుతిప్పలు పెడతాడు” అని నిక్ నైట్ చెప్పారు.