“నా పేరుతో ఫేక్ న్యూస్.. ఆ వార్తలను అస్సలు నమ్మకండి”.. అభిమానులకు సునీల్ గవాస్కర్ సీరియస్ వార్నింగ్..

ఈ స్వభావాన్ని ఆసరాగా చేసుకుని, కొన్ని అకౌంట్లు సంచలనం కోసం ఆయన చెప్పని మాటలను కూడా చెప్పినట్లుగా ప్రచారం చేస్తున్నాయి.

“నా పేరుతో ఫేక్ న్యూస్.. ఆ వార్తలను అస్సలు నమ్మకండి”.. అభిమానులకు సునీల్ గవాస్కర్ సీరియస్ వార్నింగ్..

Sunil Gavaskar

Updated On : June 27, 2025 / 3:38 PM IST

భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ తన బోల్డ్ కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. 75 ఏళ్ల వయసులోనూ తన కామెంటరీతో ఆకట్టుకుంటున్నారు. అయితే, తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సీరియస్‌గా ఓ విజ్ఞప్తి చేశారు. కొన్ని వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరుతో తప్పుడు వార్తలు వస్తున్నాయని, వాటిని గుడ్డిగా నమ్మవద్దని హెచ్చరించారు.

గత కొంతకాలంగా తన పేరును ఉపయోగించుకుని కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ వార్తలు ప్రచారం చేస్తున్నారని గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టాలని కోరుతూ, తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.

“గత కొన్ని నెలలుగా కొన్ని స్పోర్ట్స్ వెబ్‌సైట్లు, వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లలో నా పేరు మీద వక్రీకరించిన, కల్పిత వార్తలు రాస్తున్నారు  దయచేసి మీరు చదివిన ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మవద్దు. వాటిని నమ్మే ముందు తప్పనిసరిగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ముఖ్యంగా కొన్ని వ్యక్తిగత అకౌంట్ల నుంచి వచ్చే పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండండి. అందరికీ దేవుడు మేలు చేయాలి” అని గవాస్కర్ ఆ వీడియోలో స్పష్టంగా తెలిపారు. ఈ పోస్ట్ క్యాప్షన్‌లో కూడా.. “నా పేరుతో వస్తున్న వ్యాఖ్యలను నమ్మేముందు కచ్చితంగా వాటిని బాగా పరిశీలించండి” అని ఆయన మరోసారి నొక్కి చెప్పారు.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో గవాస్కర్
సునీల్ గవాస్కర్ సూటిగా, నిర్భయంగా మాట్లాడతారన్న పేరుంది. ఈ స్వభావాన్ని ఆసరాగా చేసుకుని, కొన్ని అకౌంట్లు సంచలనం కోసం ఆయన చెప్పని మాటలను కూడా ఆయన చెప్పినట్లుగా ప్రచారం చేస్తున్నాయి. ఇది అభిమానులలో గందరగోళానికి దారితీస్తుండటంతో, గవాస్కర్ స్వయంగా రంగంలోకి దిగి ఈ ఫేక్ న్యూస్‌పై క్లారిటీ ఇచ్చారు.

సునీల్ గవాస్కర్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీకి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే హెడ్డింగ్లీలో జరిగిన మొదటి టెస్టులో రిషబ్ పంత్ సెంచరీ చేసినప్పుడు, కామెంటరీ బాక్స్‌లో గవాస్కర్ ఉత్సాహంతో కనపడిన తీరు అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

ఆ మ్యాచ్‌లో పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతమైన సెంచరీలు సాధించాడు. అయినప్పటికీ, ఇంగ్లాండ్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించడంతో ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. సిరీస్‌లోని రెండో టెస్ట్ మ్యాచ్ జులై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ప్రారంభం కానుంది.