T20I Tri Series 2025 : యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీకి సన్నాహాకాల్లో భాగంగా పాక్ జట్టు ట్రై సిరీస్ (T20I Tri Series 2025) ఆడుతోంది.
ఈ ట్రై సిరీస్ సిరీస్‌లో పాకిస్తాన్ అదరగొడుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మొదటి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ను 39 పరుగుల తేడాతో చిత్తు చేసిన పాక్ రెండో మ్యాచ్‌లో యూఏఈని 31 పరుగుల తేడాతో ఓడించింది.
శనివారం షార్జా వేదికగా పాకిస్తాన్, యూఏఈలు తలడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించింది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్(69; 38 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు), హసన్ నవాజ్( 56; 26 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్థశతకాలు సాధించారు. మహ్మద్ నవాజ్(25), అష్రాఫ్(16)లు రాణించారు. యూఏఈ బౌలర్లలో సిద్దుఖీ, సగీర్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీశారు. హైదర్ అలీ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 208 పరుగుల భారీ లక్ష్య చేధనలో యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులకే పరిమితమైంది. యూఏఈ బ్యాటర్లలో అసిఫ్ ఖాన్( 77; 35 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్పర్లు) మెరుపులు మెరిపించాడు. మిగిలిన వారిలో మహ్మద్ వసీం(33) రాణించగా మిగిలిన వారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. పాక్ బౌలర్లలో హసన్ అలీ మూడు వికెట్లు తీశాడు. నవాజ్ రెండు వికెట్లు పడగొట్టగా.. సల్మాన్ మిర్జా, అయూబ్ లు చోరో వికెట్ తీశారు.
భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
దాయాది దేశాలు భారత్, పాక్ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. ఆసియాకప్ 2025లో భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది.