UP T20 League 2025 Rinku Singh shows aggression after first ball wicket
Rinku Singh : ఉత్తరప్రదేశ్ టీ20 ప్రీమియర్ లీగ్ (UPT20 League) 2025 ఆదివారం (ఆగస్టు 17న) ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో మీరట్ మావెరిక్స్ , కాన్పూర్ సూపర్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా నయా ఫినిషర్, మీరట్ మావెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్ (Rinku Singh) తన బౌలింగ్‌లో తొలి బంతికే వికెట్ తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో మీరట్ మావెరిక్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. మీరట్ బ్యాటర్లలో మాధవ్ కౌశిక్ (95 నాటౌట్; 31 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు), రితురాజ్ శర్మ(60 నాటౌట్; 36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు. అక్షయ్ దుబే (44; 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు.
THE AGGRESSION OF RINKU SINGH. pic.twitter.com/qylyGgRssK
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 18, 2025
అనంతరం 226 పరుగుల లక్ష్యంతో కాన్పూర్ సూపర్ స్టార్స్ బరిలోకి దిగింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. దీంతో వన్‌డౌన్‌లో ఆదర్శ్ సింగ్ (1) బరిలోకి దిగాడు. కాగా.. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ను రింకూ సింగ్ వేశాడు. ఈ ఓవర్‌లో తొలి బంతికి ఆదర్శ్ వికెట్ల పక్కకు జరిగి భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే.. బంతి మిస్ కావడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఈ మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే కెప్టెన్ రింకూ సింగ్ వికెట్ తీయడంతో తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మీరట్ మావెరిక్స్ బౌలర్ల ధాటికి కాన్పూర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. దీంతో మీరట్ జట్టు 86 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ సీజన్‌ను గెలుపుతో ఆరంభించింది.