Courtesy BCCI
వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మారుమోగిపోతుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఈ 14 ఏళ్ల కుర్రాడు కేవలం 35 బంతుల్లోనే శతకం బాదేశాడు. గుజరాత్ బౌలర్లలపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ సిక్సర్లు, ఫోర్ల మోత మోగించాడు. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో ఇది రెండో అత్యంత వేగవంతమైన శతకం కావడం విశేషం. అంతేకాదండోయ్ టీ20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన పిన్న వయస్సుడు ఇతడే. సోమవారం నాటికి అతడి వయసు 14 ఏళ్ల 32 రోజులు. ఇక ఐపీఎల్‌లో అతి తక్కువ వయసులో సెంచరీ చేసిన మనీశ్ పాండే (19 ఏళ్ల 253 రోజులు) రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.
తండ్రి కష్టం..
ఈ బీహార్ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మెగా వేలంలో 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే.. అతడి వయసు 15 ఏళ్లు అన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లోనే అతడి తండ్రి సంజీవ్ స్పందించాడు. వాటిని కొట్టిపారేశాడు. మెగావేలం సమయానికి వైభవ్ వయసు 13 ఏళ్లు అని చెప్పాడు.
Krunal Pandya : ఐపీఎల్ ద్వారా గట్టిగానే సంపాదించిన కృనాల్ పాండ్యా.. అతడి మొత్తం ఆస్తి ఎంతంటే..?
వైభవ్ కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పాడు. చిన్నప్పటి నుంచే ఎంతో కష్టపడ్డాడని తెలిపాడు. 8 ఏళ్ల వయసులోనే అండర్ 16 జిల్లా ట్రయల్స్‌లో అద్భుతంగా ఆడాడని చెప్పుకొచ్చాడు. కోచింగ్ కోసం అతడిని సమస్తిపూర్‌కి తీసుకువెళ్లి, తీసుకువచ్చేవాడినని అన్నారు. అతడు క్రికెటర్‌గా ఎదిగేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశానని చెప్పాడు. ఇందుకోసం తన వ్యవసాయ భూమిని అమ్మేశానని, ఇప్పటికి కూడా ఆర్థిక సమస్యలు ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
2011 మార్చి 27న బీహార్‌లో జన్మించాడు వైభవ్. అతను జనవరి 2024లో కేవలం 12 సంవత్సరాల 284 రోజుల వయసులో బీహార్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. గత సంవత్సరం అతను చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన భారత U19 మ్యాచ్‌లో పాల్గొన్నాడు, అక్కడ అతను 58 బంతుల్లో శతకం బాదాడు.
SMAT 2024 టోర్నమెంట్ సమయంలో బీహార్ తరపున తన టీ20 అరంగేట్రం కూడా చేసాడు. 2024-25 ACC అండర్ 19 ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఏడవ ఆటగాడిగా కూడా నిలిచాడు. అతను టోర్నమెంట్‌లో 5 మ్యాచ్‌ల్లో 176 పరుగులు చేశాడు అత్యధిక స్కోరు 76*.
ఇక ఐపీఎల్‌లో తొలి బంతికే సిక్స్ కొట్టి తన కెరీర్‌ను ఘనంగా ప్రారంభించిన సూర్యవంశీ.. మూడో మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌ల్లో 75.50 సగటు 222.05 స్ట్రైక్‌రేటుతో 151 పరుగులు చేశాడు.