Venkatesh Iyer hopes to return to KKR despite being released ahead of IPL 2026
Venkatesh Iyer : ఐపీఎల్ 2026 మినీ వేలానికి స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ వదిలివేసింది. అయినప్పటికి కూడా భవిష్యత్ ఐపీఎల్ సీజన్లలో కోల్ కతా నైట్ రైడర్స్ తో తిరిగి కలవాలనే కోరికను అయ్యర్ వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2025లో కేకేఆర్ జట్టు వెంకటేష్ అయ్యర్(Venkatesh Iyer)ను రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే.. ఈ సీజన్‌లో అయ్యర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో అతడిని కేకేఆర్ వేలానికి విడుదల చేసింది. అతడితో పాటు ఆండ్రీ రస్సెల్, క్వింటన్ డికాక్, మోయిన్ అలీ, అన్రిచ్ నార్ట్జే, స్పెన్సర్ జాన్సన్, రహ్మానుల్లా గుర్బాజ్ లను సైతం వదులుకుంది. ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
తనను కేకేఆర్ వదిలివేయడం పై తాజాగా వెంకటేష్ అయ్యర్ స్పందించాడు. ఈ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేయలేదన్నాడు. నిజం చెప్పాలంటే ఇంకా ఆ జట్టుతో టచ్‌లోనే ఉన్నట్లుగా వెల్లడించాడు. కేకేఆర్ కోచ్ అభిషేక్ నాయర్‌తో మాట్లాడుతున్నట్లుగా తెలిపాడు. వేలం కోసం తాను ఎదురుచూస్తున్నానని, అక్కడ ఏం జరుగుతోందో చూద్దామన్నాడు.
కేకేఆర్ తనను వేలంలో కొనుగోలు చేయలేకపోతే.. అప్పుడు లీగ్‌లోని ఇతర జట్లలో ఏ తరుపున అయిన ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు అవసరమైతే కెప్టెన్‌కు సలహాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్నాడు.
‘మా లాంటి ఆటగాళ్లకు ఐపీఎల్ ఓ అద్భుత అవకాశం. నేను ఏ జట్టు తరపున ఆడుతున్నాననేది ముఖ్యం కాదు. నేను నా అత్యుత్తమ ప్రదర్శన చేస్తాను. ఇక నా హృదయాన్ని అడగాల్సి వస్తే మాత్రం.. నేను ఇప్పటికీ కేకేఆర్ తరపున ఆడాలనుకుంటున్నాను. నేను కేకేఆర్‌తో కలిసి ఒక ఛాంపియన్‌షిప్ గెలిచాను. నేను వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. కేకేఆర్‌కి మరింత కీర్తి తీసుకురావాలనుకుంటున్నాను. ఎందుకంటే వారు నాపై చాలా నమ్మకం ఉంచారు.’ అని అయ్యర్ తెలిపాడు.
ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసినప్పటి నుంచి అయ్యర్ ఇప్పటివరకు 62 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 29.96 సగటుతో 137.32 స్ట్రైక్‌రేటుతో 1468 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 12 అర్థశతకాలు ఉన్నాయి. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీశాడు.