Virat Kohli Arrives In Delhi Ahead Of Australia Flight
Virat Kohli : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గత కొన్నాళ్లుగా తన భార్య, పిల్లలతో కలిసి లండన్‌లో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. టీమ్ఇండియా ఆసీస్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో జట్టుతో కలిసేందుకు కోహ్లీ (Virat Kohli ) భారత్‌లో అడుగుపెట్టాడు. మంగళవారం ఉదయం అతడు ఢిల్లీకి చేరుకున్నాడు.
అతడు ఢిల్లీలోని విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అతడితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాగా.. ఐపీఎల్ 2025 తరువాత కోహ్లీ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
KING KOHLI IN DELHI. 🐐 pic.twitter.com/NQnlBnF5xz
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2025
అక్టోబర్ 19 నుంచి..
టెస్టులకు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తరువాత రో-కో ద్వయం ఈ సిరీస్‌తోనే భారత జెర్సీలో కనిపించనుంది.
కాగా.. ఈ సిరీస్ తరువాత కోహ్లీ, రోహిత్‌లకు వన్డేలకు సైతం వీడ్కోలు పలుకుతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇటు రోహిత్ గానీ, అటు కోహ్లీ గానీ ఇంతవరకు స్పందించలేదు. వీరిద్దరు 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
IND vs WI : అవార్డులు, నగదు బహుమతులు అందుకున్న ప్లేయర్లు వీరే.. ఎవరికి ఎంతంటే..?
ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో వన్డే సిరీస్ కోసం భారత జట్టు రెండు బృందాలుగా అక్టోబర్ 15న ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. విమాన టికెట్ల లభ్యత, లాజిస్టిక్స్ వంటి కారణాలతో బుధవారం ఉదయం ఒక బృందం, సాయంత్రం మరో బృందం ఆసీస్ విమానమెక్కనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.