Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దూసుకుపోతుంది. సొంత గడ్డపై ఓటములను ఎదుర్కొంటున్న ఆర్‌సీబీ ప్రత్యర్థి హోంగ్రౌండ్లలో రెచ్చిపోతుంది. ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించింది. అనంతరం విరాట్ కోహ్లీ (73 నాటౌట్; 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), దేవ్‌దత్ పడిక్కల్ (61; 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో లక్ష్యాన్ని బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అవార్డు అందుకున్న తరువాత కోహ్లీ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే ఈ అవార్డులకు తాను అర్హుడిని కాదు అని చెప్పాడు. తన కంటే దేవ్‌దత్ పడిక్కల్ అద్భుతంగా ఆడాడని అతడికే ఈ అవార్డు ఇవ్వాల్సిందన్నాడు. తనకు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదన్నాడు.
ఇక విజయం గురించి మాట్లాడుతూ.. ఇది తమకు ఎంతో ముఖ్యమైన మ్యాచ్ అని చెప్పాడు. ‘ఈ రెండు పాయింట్లు ప్లేఆఫ్స్ రేసులో భారీ తేడాను కలిగిస్తాయి. మేము బయటి స్టేడియాల్లో అద్భుతంగా ఆడుతున్నాము. ఎనిమిది నుంచి పది పాయింట్లకి చేరుకున్నప్పుడు.. పాయింట్ల పట్టికలో భారీ తేడా వస్తుంది. ప్రతి మ్యాచ్‌లో రెండు పాయింట్లు సాధించాలనే మైండ్ సెట్ ఉండాలి.’ అని కోహ్లీ అన్నాడు.
ఇక తాను దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నట్లు కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఓ ఎండ్ క్రీజులో ఉంటూ.. ఆఖరిలో దూకుడుగా ఆడాలని అనుకున్నాను. ఇలా ఆడుతున్నప్పుడు ఓ విధమైన టెన్షన్ ఉంటుందన్నాడు. గత మ్యాచ్‌లో వర్షం వల్ల ఓవర్లు కుదించడంతో కాస్త కష్టంగా అనిపించింది. టీ20ల్లో ఒక్క భాగస్వామ్యం ఆటను మార్చేస్తుందని చెప్పాడు.
ఇక వేలంలో మంచి జట్టును కొనుగోలు చేసినట్లు చెప్పాడు. డేవిడ్, జితేష్, పాటిదార్ వంటి ఆటగాళ్లు తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. రొమారియో జట్టులోకి రావడం బాగుంది. లివింగ్ స్టోన్ ఉండనే ఉన్నాడు. వీరందరిలో గెలవాలన్న తపన కనిపిస్తోంది. ఇలా ఆడినప్పుడు గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని కోహ్లీ అన్నాడు.
పంజాబ్ కింగ్స్ పై విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు ఆర్‌సీబీ 8 మ్యాచ్‌లు ఆడగా 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 10 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +0.472గా ఉంది.