Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. గురువారం చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా.. ఈ సీజన్‌లో సొంత స్టేడియంలో వరుసగా మూడు ఓటముల తరువాత ఆర్‌సీబీకి ఇదే తొలి గెలుపు కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (70; 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), దేవ్‌దత్ పడిక్కల్ (50; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, వనిందు హసరంగ తలా ఓ వికెట్ పడగొట్టాడు.
IPL 2025: అయ్యో రాజస్థాన్.. జస్ట్ మిస్.. చివరి రెండు ఓవర్లలో ఫలితాన్ని మార్చేసిన ఆర్సీబీ..
అనంతరం యశస్వి జైస్వాల్ (49; 19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ధ్రువ్ జురెల్ (47; 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినప్పటికి రాజస్థాన్ లక్ష్యఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ నాలుగు వికెట్లు తీశాడు. కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ చెరో వికెట్ సాధించారు.
ఈ సీజన్‌లో హోం గ్రౌండ్‌లో తొలి విజయాన్ని అందుకోవడం పై ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఆర్‌సీబీ బ్యాటింగ్ యూనిట్ కలిసి కొన్ని విషయాలను చర్చించుకుని, ప్రణాళికలను మైదానంలో సరిగ్గా అమలు చేసి మంచి స్కోర్లు సాధిస్తున్నామని చెప్పాడు. నిజం చెప్పాలంటే రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ చాలా బాగా సాయపడిందన్నాడు.
రాజస్థాన్ చాలా బాగా ఆడిందని, అయినప్పటికి తాము రెండు పాయింట్లు గెలవడం ఎంతో ముఖ్యమైనది చెప్పాడు. ఇక్కడ టాస్ గెలవం అనేది మొదటి సవాల్. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఈ పిచ్ పై ఆడిన మ్యాచ్‌ల్లో మంచి స్కోర్లు చేయడానికి కాస్త కష్టపడ్డాం. అయితే.. ఈ రోజు ఎంతో సాఫీగా వెళ్లిపోయింది. అని కోహ్లీ తెలిపాడు.
Viral Video : పీఎస్‌ఎల్‌లో ఐపీఎల్ జపం.. పాక్ దిగ్గజ ఆటగాడి బ్లండర్ మిస్టేక్..
‘రాజస్థాన్‌తో మ్యాచ్‌లో మా ప్లాన్ ఏంటంటే.. ఓ ఆటగాడు ఇన్నింగ్స్ మొత్తం నిలబడాలి. మరో ఎండ్‌లో మిగిలిన ఆటగాళ్లు పూర్తి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలి. అది వర్కౌట్ అయింది. గత మూడు మ్యాచ్‌లలో మేము ముందే షాట్లు ఆడడానికి ప్రయత్నించాము. అయితే.. ఈ మ్యాచ్‌లో బంతి చాలా దగ్గరికి వచ్చే వరకు వేచి చూశాము. ఇప్పుడు ఇక్కడ మేము ఎలా బ్యాటింగ్ చేయాలో గుర్తించాం. ఇక మిగిలిన హోం గ్రౌండ్ మ్యాచ్‌ల్లో మేము ఇంకాస్త మెరుగ్గా ఆడతాం. అదనంగా 15 నుంచి 20 చేసేలా బ్యాటింగ్ చేస్తాం. అభిమానుల మద్దతు అద్భుతం. ఇక్కడ ఎన్నో చాలా మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.’ అని కోహ్లీ అన్నాడు.