Virat Kohli creates world record
Virat Kohli creates world record : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఘనతను అందుకున్నాడు. ఆదివారం ఇండోర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచులో విరాట్ దీన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 16 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఛేజింగ్ (లక్ష్య ఛేదన)లో 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
టీ20ల్లో కోహ్లీ ఇప్పటి వరకు 46 సార్లు లక్ష్యఛేదనల్లో బ్యాటింగ్ చేశాడు. 71.85 సగటుతో 136.96 స్ట్రైక్‌రేటులో 2012 పరుగులు చేశాడు. ఇందులో 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం టీ20 క్రికెట్‌కు కోహ్లీ దూరంగా ఉన్నాడు. దాదాపు 14 నెలల తరువాత అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారానే రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీ మ్యాచులోనే అతడు ఈ ఘనత అందుకోవడం విశేషం.
Sikandar Raza : టీ20ల్లో జింబాబ్వే కెప్టెన్ అరుదైన ఘనత.. దిగ్గజ ఆటగాళ్ల వల్లే కాలే..!
వన్డేల్లోనూ..
ఇక వన్డేల్లోనూ ఈ రికార్డు కోహ్లీ పేరిటే ఉండడం విశేషం. ఇప్పటి వరకు లక్ష్యఛేదనలో కోహ్లీ వన్డేల్లో 152 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 65.49 సగటుతో 93.64 స్ట్రైక్‌రేటుతో 7794 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు, 40 అర్ధశతకాలు ఉన్నాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో గుల్బాదిన్ నైబ్ (57) అర్ధశతకంతో రాణించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా శివమ్ దూబె ఓ వికెట్ సాధించాడు.
Cooch Behar Trophy : కర్ణాటక యువ బ్యాటర్ సంచలన ప్రదర్శన.. ఒకే ఇన్నింగ్స్‌లో 404 నాటౌట్
అనంతరం లక్ష్యాన్ని భారత్ 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (68), శివమ్ దూబె(63 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన భారత్ మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది.