Virat Kohli-Rohit Sharma : వారి నాయనో.. రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డుకు ఎసరు పెట్టిన కోహ్లీ..
అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు ఐపీఎల్‌లోనూ ఏ రికార్డును విరాట్ కోహ్లీ వదిలిపెట్టడం లేదు.

Courtesy BCCI
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఐపీఎల్‌లో అతడు మరో రికార్డుపై కన్నేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా నేడు (గురువారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌లో గనుక కోహ్లీ 5 సిక్సర్లు కొడితే.. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేస్తాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా ప్రస్తుతం రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. 256 ఇన్నింగ్స్‌ల్లో 282 సిక్సర్లను హిట్‌మ్యాన్ బాదాడు. అటు కోహ్లీ 248 ఇన్నింగ్స్‌ల్లో 278 సిక్సర్లను కొట్టాడు.
ఇక ఓవరాల్‌గా తీసుకుంటే ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు విండీస్ వీరుడు క్రిస్‌గేల్ పేరిట ఉంది. గేల్ 141 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 357 సిక్సర్లను బాదాడు. గేల్ తరువాతి స్థానాల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, డివిలియర్స్ లు ఉన్నారు.
ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు వీరే..
క్రిస్ గేల్ – 357 సిక్సర్లు
రోహిత్ శర్మ- 282 సిక్సర్లు
విరాట్ కోహ్లి – 278 సిక్సర్లు
ఎంఎస్ ధోని – 259 సిక్సర్లు
ఏబీ డివిలియర్స్- 251 సిక్సర్లు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 4 మ్యాచ్‌ల్లో 6 సిక్సర్లు బాదాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా లక్నో ప్లేయర్ నికోలస్ పూరన్ కొనసాగుతున్నాడు. పూరన్ 5 మ్యాచ్‌ల్లో 24 సిక్సర్లు బాదాడు. మిచెల్ మార్ష్ (15), శ్రేయస్ అయ్యర్ (14) లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు.