CSK : 180 ఫ్లస్ లక్ష్యమా.. అబ్బే మా వల్ల కాదు.. గత కొన్నేళ్లుగా చెన్నైది ఇదే కథ.. రైనా ఎంత పని చేసావయ్యా..
చెన్నైతో మ్యాచ్ అంటే చాలు పిచ్‌తో సంబంధం లేకుండా తొలుత బ్యాటింగ్ తీసుకుని 180 పైకి పరుగులు నిర్దేశించి మ్యాచ్‌లు గెలిచేస్తున్నారు.

Courtesy BCCI
చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ మేటి జట్లలో ఒకటి. ఇప్పటి వరకు ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. 10 సార్లు ఫైనల్‌కు వెళ్లింది. ఇలాంటి ఘనత మరే జట్టుకు లేదు. అయితే.. ప్రస్తుత ఐపీఎల్ 2025 సీజన్‌లో అంచనాలు అందుకోవడంలో ఆ జట్టు వెనుకబడి పోయింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.
కాగా.. చెన్నై ఓడిపోయిన నాలుగు మ్యాచ్‌లు కూడా ఛేదనలో కావడం గమనార్హం. కారణాలు ఏవైనా సరే.. గత కొన్నాళ్లుగా చెన్నైను ఓ బలహీనత వెంటాడుతోంది. లక్ష్యం 180 పరుగులకు పైన ఉంటే చాలు.. చెన్నై బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. ఇది ప్రత్యర్థి జట్లకు వరంలా మారుతోంది. చెన్నైతో మ్యాచ్ అంటే చాలు పిచ్‌తో సంబంధం లేకుండా తొలుత బ్యాటింగ్ తీసుకుని 180 పైకి పరుగులు నిర్దేశించి మ్యాచ్‌లు గెలిచేస్తున్నారు.
ఈ సీజన్‌లో కూడా చెన్నై ఓడిపోయిన నాలుగు మ్యాచ్‌ల్లో లక్ష్యం 180 ఫ్లస్ పైన ఉండడం గమనార్హం. సీఎస్‌కే గెలిచిన ఆ ఒక్క మ్యాచ్‌లో లక్ష్యం 180లోపే ఉండడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 155 పరుగులు చేయగా 19.1ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి చెన్నై లక్ష్యాన్ని అందుకుంది.
దాదాపుగా ఏడేళ్ల నుంచి ఇదే కథ..
చెన్నైకి ఉన్న ఈ బలహీనత ఇప్పటిది కాదు. దాదాపుగా ఏడేళ్ల నుంచి ఉంది. చివరి సారిగా చెన్నై జట్టు 2018లో 180 ఫ్లస్ పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన లీగ్, ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. నాటి నుంచి మొన్నటి పంజాబ్ మ్యాచ్ వరకు 180 ఫ్లస్ పరుగుల లక్ష్యాన్ని 11 సార్లు ఛేదించాల్సి వచ్చింది. కనీసం ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనూ సీఎస్‌కే విజయాన్ని అందుకోలేకపోయింది.
Sai Sudharsan : ఆటలోనే కాదు.. సంపాదన పరంగా కూడా.. సాయి సుదర్శన్ ఆస్తి ఎంతో తెలుసా?
ఈ మ్యాచ్‌ల్లో టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేస్తుండగా, మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా ఆడే ఆటగాడు లేకపోవడం చెన్నై ఓటములకు ప్రధాన కారణం.
రైనా, రాయుడు లేని లోటు..
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్‌ను నిలపడంలో ఆ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా కీలక పాత్ర పోషించాడు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి వేగంగా పరుగులు చేస్తూ జట్టుకు ఎన్నో మధురమైన విజయాలను అందించాడు. లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడుతూ వేగంగా లక్ష్యాన్ని కరిగించేవాడు. దీంతో ఆ తరువాత వచ్చే బ్యాటర్లకు సులువుగా ఉండేది. రైనా రిటైర్‌మెంట్ చెప్పాక 180 ఫ్లస్ లక్ష్య ఛేదనలో సీఎస్‌కే ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు అంటే రైనా ఏ స్థాయిలో లక్ష్య ఛేదనలో ఆడేవాడో అర్థంచేసుకోవచ్చు.
ధోని ఉన్నా సరే గతంలో లాగా అతడు బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. ఆ 11 మ్యాచ్‌ల్లో రుతురాజ్ నాలుగు సార్లు డకౌట్ కాగా.. మరో నాలుగు సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు.
ఈ సీజన్‌లో ఆర్ఆర్‌తో మ్యాచ్‌లో ఓడిపోయిన తరువాత సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. మిడిల్ ఆర్డర్‌లో అజింక్యా రహానే, అంబటి రాయుడు వంటి ఆటగాళ్లు లేకపోవడంతోనే తాను వన్‌డౌన్‌లో రావాల్సి వస్తోందని చెప్పాడు. దీని బట్టి రైనా, రహానే, రాయుడు వంటి ఆటగాళ్లు సీఎస్‌కే కు దూరం అయిన తరువాత మిడిల్ ఆర్డర్ బలహీనంగా మారినట్లు సాక్షాత్ ఆ జట్టు కెప్టెనే ఒప్పుకున్నాడు. ఇక ఆ జట్టు ఆటతీరు తీసికట్టుగా మారుతుందనేది కాదనలేని సత్యం.
ప్రస్తుత సీజన్‌లో సీఎస్‌కే ఆటతీరును చూస్తుంటే మరోసారి ఆ జట్టు లీగ్ దశకే పరిమితం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.