Virat Kohli: ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11మంది అమాయకులు చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి చిక్కులు ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. విరాట్ కోహ్లిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన సోషల్ యాక్టివిస్ట్ హెచ్‌ఎం వెంకటేశ్ కోహ్లిపై బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చినస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటకు విరాట్ కోహ్లీ కూడా కారణమని ఆయన ఆరోపించారు. కోహ్లీపైనా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరారు. కోహ్లీపై అందిన ఫిర్యాదుపై కబ్బన్ పార్క్ పోలీసులు స్పందించారు. వెంకటేశ్ చేసిన ఫిర్యాదును ఇప్పటికే నమోదైన కేసు కింద పరిగణనలోకి తీసుకుంటామని, తొక్కిసలాట సంఘటనపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తామని పోలీసులు వెల్లడించారు.
18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన తొలి ఐపీఎల్ టైటిల్ ను సాధించిన విషయం తెలిసిందే. దీంతో జట్టు ఆటగాళ్లను సత్కరించేందుకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జూన్ 4 ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఆర్సీబీ ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 30 వేలే. అయితే, దాదాపు 3 లక్షల మంది వరకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది.
Also Read: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్..
ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తొక్కిసలాట ఘటనను సుమోటోగా తీసుకున్న కర్నాటక హైకోర్టు.. కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. అందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అటు తొక్కిసలాట ఘటనపై సీఎం సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ ను సస్పెండ్ చేశారు. అనేక మంది సీనియర్ పోలీసు అధికారులను సైతం సస్పెండ్ చేశారు. ఆర్సీబీ, డీఎన్ఏ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్, కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో ఈ ఘటనపై విచారణ కోసం కర్నాటక హైకోర్టు రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్ కమిషన్ వేశారు. ఈ పరిస్థితుల్లో విరాట్ కోహ్లిపై పోలీసులకు ఫిర్యాదు అండదం హాట్ టాపిక్ గా మారింది. నెక్ట్స్ ఏం జరగనుంది? అనేది ఉత్కంఠ రేపుతోంది.