Virat kohli needs 443 runs to reach 15k milestone in ODIs
Virat kohli : జనవరి 11 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ సిరీస్‌లో కోహ్లీ 443 పరుగులు చేస్తే వన్డే క్రికెట్ చరిత్రలో 15 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
వన్డే క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతానికి టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాత్రమే వన్డేల్లో ఈ మైలురాయిని చేరుకున్న ఏకైక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు సైతం సచిన్ పేరిటే ఉంది. ఈ జాబితాలో కోహ్లీ రెండో స్థానంలోనే ఉన్నాడు.
2008లో వన్డేల ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు విరాట్ కోహ్లీ. ఇప్పటి వరకు అతడు 308 వన్డేలు ఆడాడు. 296 ఇన్నింగ్స్‌ల్లో 58.5 సగటుతో 14557 పరుగులు చేశాడు. ఇందులో 53 సెంచరీలు, 76 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక సచిన్ విషయానికి వస్తే.. 463 వన్డేలు ఆడాడు. 452 ఇన్నింగ్స్‌ల్లో 44.8 సగటుతో 18426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి వన్డే మ్యాచ్ – జనవరి 11 (వడోదర)
* రెండో వన్డే మ్యాచ్ – జనవరి 14 (రాజ్ కోట్)
* మూడో వన్డే మ్యాచ్ – జనవరి 18 (ఇండోర్)