Virat Kohli Test Retirement Real reason is here report
భారత జట్టు జూన్‌లో ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్.. ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది. సరిగ్గా పర్యటనకు కొన్ని వారాల ముందు మే 12న టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అతడి నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కోహ్లీ ఫిట్‌నెస్‌ను పరిగణలోకి తీసుకుంటే మరో మూడు నుంచి నాలుగేళ్ల పాటు ఈ ఫార్మాట్‌లో ఆడే సత్తా అతడిలో ఉందని అనిపిస్తుంది.
కాగా.. అతడు సడెన్ రిటైర్‌మెంట్ ప్రకటించడం వెనుక ఉన్నకారణం ఇదేనని ఓ వార్త వైరల్ అవుతోంది. జట్టు నుంచి తనను తొలగించకముందే గౌరవంగా తప్పుకోవాలని కోహ్లీ భావించాడని అంటున్నారు.
Asia Cup 2025 : బీసీసీఐ కీలక నిర్ణయం..! ఆసియా కప్ నుంచి భారత్ ఔట్..!
భారత దిగ్గజ ఆటగాళ్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అందరూ కూడా ఆస్ట్రేలియా జట్టుతోనే తమ చివరి టెస్టు మ్యాచ్‌ను ఆడారు. యాదృచ్ఛికంగా వీరెవరు కూడా ఆ సమయంలో తాము టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పలేదు. కానీ ఆ తరువాత మారిన సమీకరణాల వల్ల వీరంతా సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. జట్టు నుంచి తప్పించి వాళ్ల గౌరవాన్ని తగ్గించకుండా వారి చేత బీసీసీఐ రాజీనామా చేయించి ఉండొచ్చునని చాలా మంది విశ్వసిస్తున్నారు.
వీరిలో విరాట్ కోహ్లీ తనకు తానుగా రిటైర్‌మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే.. ఇంగ్లాండ్ పర్యటనల్లో అంచనాలు అందుకోవడంలో అతడు విఫలం అయితే అప్పుడు జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు అది సెలక్టర్ల నిర్ణయం అవుతుంది. కోహ్లీ లాంటి ఆటగాడికి సముచిత గౌరవం అవసరం, ఇంగ్లాండ్‌లో రాణించకుంటే మీడియాతో పాటు అభిమానులు అతడి రిటైర్‌మెంట్ కోసం పట్టుబట్టేవాళ్లని అని బీసీసీఐలోని ఓ ఉన్నతాధికారి తెలిపినట్లు సదరు వార్తల సారాంశం.
2014 ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ పేలవ ప్రదర్శన చేశాడు. అయితే.. 2018, 2021 పర్యటనల్లో మాత్రమ అదరగొట్టాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలోనూ టెస్ట్ మ్యాచ్‌లను గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. అయితే.. కరోనా అతడి లయను దెబ్బతీసింది. కరోనా తరువాత నుంచి అతడి టెస్టు గణాంకాలు తగ్గుతూ వస్తున్నాయి. చివరి 39 మ్యాచ్‌ల్లో 69 ఇన్నింగ్స్‌ల్లో 30.72 సగటున మాత్రమే పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. 2010లో అతడి సగటు 50కిపైగా ఉండగా రిటైర్ అయ్యే సమయానికి 46.85 పడిపోవడం గమనార్హం.
మొత్తంగా విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్‌లో 210 ఇన్నింగ్స్‌ల్లో 9230 పరుగులు సాధించాడు. 2014 నుంచి 2022 వరకు సారథిగా 68 టెస్టులకు నాయకత్వం వహించగా 40 టెస్టుల్లో గెలిపించాడు.