Asia Cup 2025 : బీసీసీఐ కీలక నిర్ణయం..! ఆసియా కప్ నుంచి భారత్ ఔట్..!
భారత్, పాక్ ల మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది

India will not play Asia Cup 2025 amidst tensions with Pakistan report
భారత్, పాక్ ల మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుందని పలు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి బీసీసీఐ సమాచారం ఇచ్చినట్లు సమాచారం.
దీంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే పురుషుల ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ ఆడే అవకాశాలు లేవు. ఇక జూన్ నెలలో జరగనున్న మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి కూడా భారత్ వైదొలగాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా.. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
పాకిస్తాన్ మంత్రి, పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు.
‘పాకిస్తాన్ మంత్రి చీఫ్‌గా ఉన్న ACC నిర్వహించే టోర్నమెంట్‌లో భారత జట్టు ఆడకూడదు. అది దేశ సెంటిమెంట్. రాబోయే ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుండి మేము వైదొలగుతున్నట్లు ACCకి మౌఖికంగా తెలియజేశాము, వారి ఈవెంట్లలో మా భవిష్యత్ భాగస్వామ్యం కూడా నిలిపివేయబడింది. మేము భారత ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము.’ అని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
కాగా.. సోని పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఆసియా కప్ మీడియా హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఎనిమిదేళ్ల కాలానికి 170 మినియన్ డాలర్లతో ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది ఆసియా కప్ జరగపోయే ఈ ఒప్పందం రద్దు అయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. 2023లో జరిగిన ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడ్‌లోనే నిర్వహించారు. పాక్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వగా.. ఆదేశానికి వెళ్లేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో శ్రీలంక వేదికగా భారత మ్యాచ్‌లను నిర్వహించారు. ఇప్పటికే భారత్, పాక్ ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి.
భారత్ లేకుండా ఈ టోర్నీని నిర్వహించే అవకాశాలు దాదాపుగా లేవు. ఇప్పుడు బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో టోర్నీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.