Shubman Gill-Sai Sudharsan : చరిత్ర సృష్టించిన సాయిసుదర్శన్- గిల్ జోడీ.. ఐపీఎల్ హిస్టరీలో ఏ జంట అందుకోలేని ఘనత..
ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. అంతేకాదండోయ్ ఓ గొప్ప రికార్డును సైతం తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్‌లో వికెట్ కోల్పోకుండా 200 పరుగులు చేజ్ చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. కేఎల్ రాహుల్ (112 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆ తరువాత సాయి సుదర్శన్ (108 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (93 నాటౌట్) దంచికొట్టడంతో లక్ష్యాన్ని గుజరాత్ 19 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అందుకుంది.
కాగా.. ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్‌లో 800 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారత జోడీగా సాయి సుదర్శన్, గిల్ జంట చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో శిఖర్ ధావన్, పృథ్వీ షా జోడీని అధిగమించింది.
ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత జోడీలు..
* శుభమాన్ గిల్, సాయి సుదర్శన్ – 839* పరుగులు ( 2025లో గుజరాత్ టైటాన్స్ )
*శిఖర్ ధాన్, పృథ్వీ షా – 744 పరుగులు (2021లో ఢిల్లీ క్యాపిటల్స్)
* మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ – 671 పరుగులు (2020లో పంజాబ్ కింగ్స్)
* మయాంక్ అగ్వారల్, కేఎల్ రాహుల్ – 602 పరుగులు (2021లో పంజాబ్ కింగ్స్)
* విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ – 601 పరుగులు (2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
ఈ సీజన్‌లో సాయి సుదర్శన్, గిల్ లు భీకర ఫామ్‌లో ఉన్నారు. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం వీరిద్దరు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. సాయిసుదర్శన్ ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడాడు. 56.09 సగటుతో 156.99 స్ట్రైక్‌రేట్‌తో 617 పరుగులు సాధించాడు. ఇక గిల్ విషయానికి వస్తే.. 12 మ్యాచ్‌ల్లో 60.10 సగటు 155.69 స్ట్రైక్‌రేట్‌తో 601 పరుగులు చేశాడు.