LSG vs SRH : లక్నోతో మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ కు భారీ షాక్.. కరోనా బారిన పడిన ఎస్ఆర్‌హెచ్ స్టార్ ప్లేయర్
లక్నోతో మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కు గట్టి షాక్ తగిలింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎప్పుడో నిష్ర్కమించింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా మూడు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆ జట్టు ఖాతాలో ఏడు పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ -1.192గా ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది.
లీగ్ దశలో సన్‌రైజర్స్ మరో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంతో సీజన్‌ను ముగించాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా ఆస్ట్రేలియా వెళ్లిపోయిన ట్రావిస్ హెడ్ ఇంకా భారత్‌కు రాలేదు. అతడు ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ కోచ్ డానియల్ వెటోరి తెలిపాడు.
‘ట్రావిస్ హెడ్ కాస్త ఆలస్యంగా వస్తున్నాడు. అతడు సోమవారం ఉదయం భారత్‌కు వస్తాడు. ప్రస్తుతం అతడు కరోనాతో బాధపడుతున్నాడు. అందుకనే అతడు ప్రస్తుతం ప్రయాణం చేయడం లేదు. అతడు వచ్చాక పరిస్థితిని పరిశీలించి అతడిని ఆడించాలా వద్దా అన్న విషయం పై నిర్ణయం తీసుకుంటాం.’ అని సన్‌రైజర్స్ కోచ్ వెటోరి తెలిపాడు. దీంతో లక్నోతో మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ ఆడడం అనుమానమే.
ఐపీఎల్ 2024 సీజన్‌లో ట్రావిస్ హెడ్ అద్భుతంగా రాణించాడు. ఆ సీజన్‌లో 567 పరుగులు చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. ఐపీఎల్ 2025 సీజన్‌లో అతడు తడబడుతున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 281 పరుగులు చేశాడు.