Virat Kohli
ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లి అదరగొడుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. నాలుగు మ్యాచుల్లోనే 203 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. అయితే.. కోహ్లి రానిస్తున్నప్పటికీ కూడా అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం విజయాలను అందుకోవడం లేదు. నాలుగు మ్యాచుల్లో ఒక్క విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది బెంగళూరు. అయితే.. ఇప్పుడు ఓ విషయం ఆ జట్టు అభిమానులను కలవరపెడుతోంది. ఈ మ్యాచ్‌కు సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదిక అన్న సంగతి తెలిసిందే. ఈ మైదానంలో కోహ్లి రికార్డు చాలా పేలవంగా ఉంది. టీమ్ఇండియా తరుపున ఈ మైదానంలో అద్భుత రికార్డు ఉన్నప్పటికి ఐపీఎల్‌కు వచ్చేసరికి తేలిపోతున్నాడు. టీమ్ఇండియా తరుపున ఈ గ్రౌండ్‌లో 3 మ్యాచుల్లో 195 పరుగులు చేయగా ఐపీఎల్‌లో 8 మ్యాచులు ఆడి 149 పరుగులే చేశాడు.
Sourav Ganguly : ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు.. ముంబై అభిమానులకు సౌరవ్ గంగూలీ సందేశం..
ఇక చివరి సారి ఈ మైదానంలో ఆడిన మ్యాచులో 19 బంతుల్లో 18 పరుగులే చేయడం గమనార్హం. కాగా.. కోహ్లికి దేశంలోని అన్ని గ్రౌండ్లలో కన్నా ఈ గ్రౌండ్‌లో తక్కువ యావరేజ్‌ను కలిగి ఉన్నాడు. అయితే.. ప్రస్తుతం కోహ్లి ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే ఎలాంటి పిచ్‌పైనైనా అతడు పరుగులు చేయగలడు.
సందీప్ శర్మ వర్సెస్ కోహ్లి..
రాజస్థాన్ పేసర్ సందీప్ శర్మ, విరాట్ కోహ్లి మధ్య పోటీ అభిమానులను కనువిందు చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఇరువురు 15 సందర్భాల్లో తలపడ్డారు. సందీప్ బౌలింగ్‌లో 67 బంతులు ఆడిన కోహ్లి 87 పరుగులు చేశాడు. అతడి బౌలింగ్‌లో ఏడు సార్లు ఔట్ కావడం గమనార్హం. ఇక యావరేట్ 12.42 మాత్రమే. చాహల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్ బౌలింగ్ లైనప్ ఉండడంతో సందీప్‌కు చోటు దక్కుతుందో లేదో చూడాల్సిందే.
ఇక ఓవరాల్‌గా చూసుకుంటే.. రాజస్థాన్ పై కోహ్లి 29 మ్యాచులు ఆడాడు. 25.75 సగటుతో 618 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 72 పరుగులు. కాగా.. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఎలా ఆడాతాడో చూడాల్సిందే.