Washington Sundar
Teamindia : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా శనివారం జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో.. అప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు సిరీస్‌ను గెలుచుకుంది. ట్రోఫీ అందుకున్న అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ప్రకటించారు.
ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మెడల్ టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు దక్కింది. దీంతో టీమ్ ఆపరేషన్స్ మేనేజర్ రహిల్ ఖాజా సుందర్‌కు అవార్డును అందజేశారు. సుందర్ పేరు ప్రకటిస్తున్న సమయంలో తోటి క్రికెటర్లు చప్పట్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నవ్వుతూ కనిపించారు.
అవార్డు అందుకున్న తరువాత వాషింగ్టన్ సుందర్ మాట్లాడుతూ.. రహిల్ ఖాజా చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది. అతను ప్రతిరోజూ చాలా శ్రమిస్తూ తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాడు అంటూ సుందర్ కొనియాడాడు. ఆస్ట్రేలియా టూర్‌కు రావడం, తుది జట్టులో చోటు దక్కించుకోవడంతోపాటు టీమిండియా విజయంలో తోడ్పడటం తనకు చాలా సంతృప్తినిచ్చినట్లు వాషింగ్టన్ సుందర్ పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వాషింగ్టన్ సుందర్ టీమిండియా తరపున మూడు మ్యాచ్ లు ఆడాడు. బ్యాట్ తోనూ, బాల్ తోనూ సత్తాచాటి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు. మూడో మ్యాచ్ లో 23 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సులతో 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోసించాడు. నాలుగో మ్యాచ్ లో 1.2 ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్ మూడు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.