Who is 6 Foot 4 Tall Bowling Sensation Umar Nazir Mir
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉమర్ నజీర్ మీర్ పేరు మారుమోగిపోతుంది. రంజీ ట్రోఫీలో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో అతడి సంచలన ప్రదర్శననే అందుకు కారణం. జమ్ము కశ్మీర్‌కు చెందిన ఈ 6 అడుగుల 4 అంగుళాల పేసర్ తన బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టన్నుల కొద్ది పరుగులు సాధించిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానెలను ముప్పు తిప్పలు పెట్టాడు. .
రంజీట్రోఫీ ఎలైట్ మ్యాచుల్లో భాగంగా గురువారం ముంబై, జమ్ముకశ్మీర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. పేసర్ ఉమర్ నజీర్ మీర్ అద్భుతమైన స్పెల్ చేశాడు. 31 ఏళ్ల ఈ పేసర్ తన పేస్, బౌన్స్‌తో బ్యాటర్‌లను ఇబ్బంది పెట్టాడు. షార్ట్ పిచ్ డెలివరీతో రోహిత్ శర్మ (3)ను ఔట్ చేయగా, దేశవాళీ క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ముంబై కెప్టెన్ అజింక్యా రహానే(12)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక శివమ్ దూబె(0)ను తొలి బంతికే ఔట్ చేశాడు.
Rohit Sharma : 10 ఏళ్ల తరువాత రంజీల్లో రోహిత్ శర్మ.. ఇలా ఆడతాడని ఊహించలేదురా అయ్యా.. వామ్మో..
అతడితో పాటు మిగిలిన బౌలర్లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 33.2 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఉమర్ నజీర్ మీర్ 11 ఓవర్లు వేసి 41 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముంబై బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (4), శ్రేయస్ అయ్యర్ (11)లు సైతం విఫలం అయ్యారు. శార్దూల్ ఠాకూర్ (51) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఉమర్ నజీర్ మీర్ ఎవరో తెలుసా?
31 ఏళ్ల ఉమర్ నజీర్ మీర్ జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన వాడు. 6 అడుగుల 4 అంగుళాల పొడుగు ఉంటాడు. చక్కటి పేస్‌తో పాటు బౌన్స్ రాబట్టడం అతడి ప్రత్యేకత. ఎత్తు అతడికి బాగా కలిసి వచ్చే అంశం. 2013లో ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను ఆరంభించాడు. ఇప్పటి వరకు 57 మ్యాచులు ఆడి 138 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 54 వికెట్లు తీశాడు. ఇక టీ20ల్లో 32 వికెట్లు సాధించాడు. 2018–19 దేవధర్ ట్రోఫీకి ఇండియా సి జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.