IND vs ENG 1st T20 : అమ్మ ఇంగ్లాండ్.. ఎంత పని చేశారురా..? తిలక్ వర్మ వరల్డ్ రికార్డు సాధించొద్దని ఇలా ఆడతారా?
ఓ సువర్ణావకాశం తెలుగు కుర్రాడు, టీమ్ఇండియా యువ ఆటగాడు తిలక్ వర్మ చేజారింది.

Tilak Varma world record spoiled by england
Tilak Varma : ఓ సువర్ణావకాశం తెలుగు కుర్రాడు, టీమ్ఇండియా యువ ఆటగాడు తిలక్ వర్మ చేజారింది. ఇంగ్లాండ్ కారణంగా ప్రపంచ రికార్డును సాధించే అద్భుత అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు తిలక్. కోల్‌కతా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ అన్ని రంగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్లు విజృంభించడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ ఒక్కడే భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. బట్లర్ కాకుండా హ్యారీ బ్రూక్ (17), జోఫ్రా ఆర్చర్ (12) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఇంగ్లాండ్ సరిగ్గా 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడాడు. తొలి వికెట్‌కు 4.2 ఓవర్లలో 41 పరుగులు జోడించి సంజూశాంసన్ (26) పెవిలియన్‌కు చేరుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్ అయినప్పటికి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేశాడు. అతడికి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (19 నాటౌట్; 16 బంతుల్లో 3 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. ఆఖర్లో అభిషేక్ ఔటైనా హార్దిక్ పాండ్యా (3)తో కలిసి తిలక్ భారత్‌కు 12.5 ఓవర్లలో విజయాన్ని అందించాడు.
అద్భుత అవకాశం చేజారింది..
తిలక్ వర్మ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కోల్‌కతా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో అతడు సెంచరీ చేసి ఉంటే ప్రపంచ రికార్డు తిలక్ సొంతం అయిఉండేది. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా మూడు మ్యాచుల్లో సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కేవాడు.
గతేడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోని చివరి రెండు మ్యాచుల్లో తిలక్ వరుసగా 107*, 120* పరుగులు చేశాడు. కోల్‌కతా మ్యాచ్‌లో సెంచరీ చేసి ఉంటే ప్రపంచ క్రికెట్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచేవాడు. అయితే.. కోల్‌కతా మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో తిలక్ కు సెంచరీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీనిపైనే ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసుంటే..తిలక్ సెంచరీ చేసేవాడని, కావాలనే ఇంగ్లాండ్ ఆటగాళ్లు తెలుగోడి వరల్డ్ రికార్డును అడ్డుకున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.