Abhishek Sharma : అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. బొటనవేలు, చూపుడు వేలును చూపుతూ అభివాదం.. ఎవరి కోసమో తెలుసా?
హాఫ్ సెంచరీ తరువాత అభిషేక్ శర్మ విభిన్నంగా సంబురాలు చేసుకున్నాడు.

PIC Credit @BCCI TWitter
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే అర్థశతకాన్ని అందుకున్నాడు. ఓవరాల్‌గా 34 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్సర్లు బాది 79 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే.. హాఫ్ సెంచరీ తరువాత అభిషేక్ శర్మ విభిన్నంగా సంబురాలు చేసుకున్నాడు. బొటనవేలు, చూపుడు వేలు పైకి చూపిస్తూ అభివాదం చేశాడు. అతడు ఎందుకు అలా చేశాడోనని మొదటగా ఎవ్వరికి తెలియదు. మ్యాచ్ అనంతరం దానికి గల కారణాన్ని అభిషేక్ వెల్లడించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్‌లకు కృతజ్ఞతలు తెలిపేందుకు అలా చేసినట్లు వెల్లడించాడు.
ఈ మ్యాచ్‌లో రాణించడం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. తనను తాను నిరూపించుకోవాలనే తపనతోనే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగినట్లు వెల్లడించాడు. కెప్టెన్ సూర్య, కోచ్ గంభీర్‌లు పూర్థి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. యువ ఆటగాళ్లతో వారు చాలా బాగా మాట్లాడుతారన్నారు. హాఫ్ సెంచరీ తరువాత అలా అభివాదం చేయడానికి ఓకారణం ఉంది. అది కోచ్, కెప్టెన్ కోసం మాత్రమే చేసినట్లు తెలిపాడు.
ఇక ఈడెన్ గార్డెన్ పిచ్ అద్భుతంగా ఉందన్నాడు. వాస్తవానికి ఈ పిచ్ పై 160 నుంచి 170 పరుగుల లక్ష్యం ముందు ఉంటుందని భావించాను. అయితే.. బౌలర్లు చాలా బాగా రాణించారు. ముఖ్యంగా వరుణ్, అర్ష్‌దీప్ సింగ్‌లు చక్కటి బంతులతో ఇంగ్లాండ్‌ను కట్టడి చేశారు. లక్ష్య ఛేదనలో మరో ఎండ్‌లో సంజూ శాంసన్ ఉండడాన్ని ఆస్వాదిస్తాను. ఇక ఐపీఎల్‌లో దూకుడుగా ఆడడం కలిసొచ్చిందన్నాడు. ఇక జట్టులో వాతావరణం అద్భుతంగా ఉందన్నాడు. పేస్‌ను ఎదుర్కొనేందుకు తానెప్పుడు సిద్ధమేనని, ఇంగ్లాండ్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులో ఇబ్బంది పెడతారని తనకు ముందే తెలుసునని చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. సరిగ్గా 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (68; 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. హ్యారీ బ్రూక్ (17), జోఫ్రా ఆర్చర్ (12)లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ లు తలా రెండు వికెట్లు తీశాడు.
అభిషేక్ శర్మతో పాటు సంజూశాంసన్ (26), తిలక్ వర్మ (19 నాటౌట్) లు రాణించడంతో భారత్ సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ శనివారం చెన్నై వేదికగా జరగనుంది.