14 ఏళ్ల పిల్లాడిని ఐపీఎల్‌లో ఆడనిస్తున్నారు.. ఎవరు ఈ వైభవ్ సూర్యవంశీ? అంత తోపా?

వైభవ్ వంశీ 13 సంవత్సరాల వయసులోనే 1.1 కోట్లకు అమ్ముడుపోవడంతో కొన్ని నెలల క్రితమే అతడి పేరు మారుమోగిపోయింది.

Suryavanshi

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. గాయం కారణంగా రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ ఈ మ్యాచుకు దూరమయ్యాడు. సంజూ శాంసన్ స్థానంలో రియాన్‌ పరాగ్‌ కెప్టెన్సీ చేశాడు.

ఈ మ్యాచ్‌ ద్వారా 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో ఆడుతున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అతడిని రాజస్థాన్‌ రాయల్స్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తీసుకున్నారు.

సూర్యవంశీ 2011లో జన్మించాడు. 2008లో ఐపీఎల్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో, ఈ టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత జన్మించిన మొదటి ఐపీఎల్‌ ఆటగాడు సూర్యవంశీ. అతడు 2024లో ఐపీఎల్ మెగా వేలంలో కేవలం 13 సంవత్సరాల వయసులో 1.1 కోట్లకు ఎంపికై వార్తల్లో నిలిచాడు.

అతడు బిహార్‌లో జరిగిన రణధీర్ వర్మ U-19 టోర్నమెంట్‌లో 332 నాటౌట్‌గా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఇప్పటివరకు, అతను 5 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 10.00 సగటుతో, 63.29 స్ట్రైక్ రేట్‌తో 100 పరుగులు చేశాడు.

వైభవ్ వంశీ 13 సంవత్సరాల వయసులోనే 1.1 కోట్లకు ఐపీఎల్‌లో అమ్ముడుపోవడంతో కొన్ని నెలల క్రితమే అతడి పేరు మారుమోగిపోయింది. అతడిని ఎందుకు తీసుకున్నామన్న విషయంపై కూడా అప్పట్లో రాహుల్ ద్ర‌విడ్ వెల్ల‌డించారు. ఆర్ఆర్ నిర్వ‌హించిన సెల‌క్ష‌న్స్ ట్ర‌య‌ల్స్‌కు అత‌డు వ‌చ్చాడ‌ని, టాలెండ్ చూపాడ‌ని అన్నారు. వైభవ్‌లో చాలా ప్ర‌తిభ ఉంద‌ని తెలిపారు.