who will win hyderabad cricket association polls
HCA Elections 2023: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. శుక్రవారం జరగనున్న ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు 4 ప్యానెళ్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈసారి ప్రధానంగా రెండు ప్యానెల్స్ మధ్యే పోటీ ఉంటుందని అంతా భావిస్తున్నారు. గతంలో పనిచేసిన అనుభవం హెచ్‌సీఏను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుందని ఓ అభ్యర్థి ప్రకటిస్తే.. ప్రభుత్వం అండతో అసోసియేషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తామని మరో క్యాండిడేట్ చెబుతున్నారు.
శుక్రవారం జరగనున్న HCA ఎన్నికల్లో 173 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాధారణ మెజారిటీ సాధించేందుకు 87 ఓట్లు పడాల్సి ఉంటుంది. హెచ్‌సీఏ ఓటర్ల జాబితాలో 48 ఇనిస్ట్యూషన్స్, 6 జిల్లాల అసోసియేషన్లు, 15 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. ఇక ప్రభుత్వం సూచనల మేరకే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవటం ఇనిస్ట్యూషన్స్‌కు సంప్రదాయంగా వస్తోంది. ఇక క్రికెట్ సంఘాలు సైతం అదే కోవలో ఉన్నాయి.
ఈసారి హెచ్‌సీఏ ఎన్నికల రేసులో బీజేపీ సీనియర్ నేత, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి తన ప్యానల్‌ను నిలిపారు. ఇదివరకే అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన తన అనుభవం సంస్థ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన చెబుతున్నారు. అయితే.. వివేక్‌కు చెందిన విశాఖ కంపెనీ – హెచ్‌సీఏ మధ్య నడుస్తున్న వాణిజ్య ఒప్పందం కోర్టు కేసు వివేక్ ప్యానెల్‌కు ప్రతికూలంగా మారింది. ఆ కంపెనీ స్టేడియం కోసం ఖర్చు చేసిన రూ.4 కోట్లకు బదులు రూ.40 కోట్లు చెల్లించాలని ఆర్బిటేషన్ తీర్పు రావడం, అంత పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చేస్తే హెచ్‌సీఏ పరిస్థితి ఏంటని క్లబ్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, అమర్‌నాథ్ అధ్యక్షతన ఒక ప్యానల్‌గా ఏర్పడ్డారు. అయితే.. చాలా ఏండ్లుగా హెచ్‌సీఏను ఏలుతున్న పెద్దలు.. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారనే పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. అసోసియేషన్‌లో అవినీతి కార్యకలాపాలు, స్టేడియం నిర్మాణంలో అక్రమాలు, అవినీతి జరిగాయని వారిపై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు వారి వైపు మొగ్గు చూపరని మిగతా ప్యానెల్ సభ్యులు చెబుతున్నారు.
Also Read: నేను పూర్తి చేశాను.. సానియా మీర్జా ఇన్‌స్టా పోస్ట్.. విడాకుల అంశం మరోసారి తెరపైకి..!
ఇక.. HCA అధ్యక్ష పదవి రేసులో ఉన్న అర్సినపల్లి జగన్‌మోహన్‌రావు (Arshanapalli Jagan Mohan Rao) ఈసారి ఎలాగైనా ప్రెసిడెంట్ సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడిగా, కార్యదర్శిగా తన మార్క్ చూపించిన జగన్‌మోహన్‌రావు.. ప్రీమియర్ హ్యాండ్ బాల్ లీగ్‌ను ప్రారంభించి ఆ క్రీడకు దేశంలో సరికొత్త గ్లామర్ తీసుకొచ్చారు. ఇప్పుడు హెచ్‌సీఏ అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఆయనకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ కవిత అండదండలున్నాయి. దీనికితోడు 100 మంది క్లబ్ సెక్రటరీలలో మెజార్టీ సభ్యులు జగన్ ప్యానల్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
Also Read: విశాఖ క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. చెబితే అస్సలు ఆగరు!
మొత్తంగా సార్వత్రిక ఎన్నికలను తలపించేలా జరగనున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లూ అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్న అసోసియేషన్‌ను.. కొత్తగా ఎన్నికైన వారు గాడిలో పెడతారా, లేదా? అన్నది వేచి చూడాల్సిందే.