WI vs PAK 3rd ODI Jayden Seales Breaks Dale Steyn World Record
Jayden Seales : వెస్టిండీస్ పేస్ సంచలనం జేడన్ సీల్స్ (Jayden Seales ) అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. మంగళవారం ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు డేల్ స్టెయిన్ (Dale Steyn) ను అధిగమించాడు.
2012లో సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో స్టెయిల్ 39 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. తాజాగా సీల్స్ కేవలం 18 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు సాధించాడు.
వన్డే మ్యాచ్‌లో పాక్ పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు వీరే..
* జేడన్ సీల్స్(వెస్టిండీస్ ) – 6/18
* డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) – 6/39
* తిసారా పెరీరా (శ్రీలంక) – 6/44
* కార్ల్ రాకెర్మాన్ (ఆస్ట్రేలియా) – 5/16
* సౌరవ్ గంగూలీ (భారత్) – 5/16
డేల్ స్టెయిన్, తిసారా పెరెరా తర్వాత పాకిస్థాన్‌పై వన్డే మ్యాచ్‌లో 6 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా జేడెన్ సీల్స్ నిలిచాడు. తన స్పెల్‌లో 30 కంటే తక్కువ పరుగులు ఇచ్చి పాకిస్థాన్‌పై వన్డేలో 6 వన్డే వికెట్లు తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
202 పరుగుల తేడాతో పాక్ చిత్తు..
మ్యాచ్ విషయానికి వస్తే.. షై హోప్ (94 బంతుల్లో 120 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగడంతో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ చెరో రెండు వికెట్లు సాధించారు. సైమ్ అయూబ్, మొహమ్మద్ నవాజ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 295 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్ బౌలర్ జేడన్ సీల్స్ ధాటికి పాకిస్తాన్ 29.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సల్మాన్ అఘా (30), మహ్మద్ నవాజ్ (23), హసన్ నవాజ్ (13) లు మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు. మిగిలిన వారిలో ఐదుగురు బ్యాటర్లు పరుగుల ఖాతానే తెరవలేదు. స్టార్ ఆటగాడు బాబర్ ఆజాం కూడా 9 పరుగులే చేశాడు.
ఈ విజయంతో వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కాగా.. పాక్ పై వెస్టిండీస్ 34 ఏళ్ల తరువాత వన్డే సిరీస్‌ను గెలవడం గమనార్హం.