IND vs AUS : కోహ్లీ పై నిషేదం..? సిడ్నీ టెస్టు ఆడ‌డా?

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ పై ఓ మ్యాచ్ నిషేదం ప‌డనుందా అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ పై ఓ మ్యాచ్ నిషేదం ప‌డనుందా అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ అరంగ్రేట ఆట‌గాడు సామ్ కాన్‌స్టాస్‌తో కోహ్లీ ప్ర‌వ‌ర్తించిన తీరే అందుకు కార‌ణంగా తెలుస్తోంది. కోహ్లీ తీరును ఇప్ప‌టికే ఆసీస్ మాజీ క్రికెట‌ర్ రికీ పాంటింగ్ త‌ప్పుబ‌ట్టాడు. అత‌డి పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా మ్యాచ్ రిఫ‌రీతో పాటు ఐసీసీని కోరాడు.

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా గురువారం భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మెల్‌బోర్న్ వేదిక‌గా నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ అరంగ్రేట ఆట‌గాడు సామ్ కాన్‌స్టాస్ వ‌న్డే త‌ర‌హాలో బ్యాటింగ్ చేశాడు. 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 60 ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో అత్యుత్త‌మ బౌల‌ర్‌గా కొన‌సాగుతున్న జ‌స్‌ప్రీత్ బుమ్రాతో పాటు టీమ్ఇండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌ను అల‌వోక‌గా ఎదుర్కొన్నాడు.

IND vs AUS : మెల్‌బోర్న్‌లో నేనేంటో చూపిస్తా : విరాట్ కోహ్లీ..

ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌లో అత‌డు కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఓ వైపు అత‌డు దూకుడుగా ఆడుతుంటే.. అడ్డుక‌ట్ట వేసేందుకు ప్ర‌య‌త్నించిన బౌల‌ర్లు విఫ‌లం అవుతుండ‌డంతో కోహ్లీ అస‌హ‌నానికి గురైయ్యాడు. ఈ క్ర‌మంలో యువ ఆట‌గాడిని క‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు.

ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 10 ఓవ‌ర్ ముగిసిన త‌రువాత ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఓవ‌ర్ పూరైన త‌రువాత ఓ ఎండ్ నుంచి మ‌రో ఎండ్‌కు సామ్ కోన్‌స్టాస్ న‌డుచుకుంటూ వెలుతుండ‌గా ఎదురుగా వ‌చ్చిన కోహ్లీ డ్యాష్ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య స్వ‌ల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. మ‌రో ఎండ్‌లో ఉన్న ఖ‌వాజాతో పాటు అంపైర్లు వ‌చ్చి వారిద్ద‌రికి స‌ర్దిచెప్పారు.

IND vs AUS : బాక్సింగ్‌డే టెస్టు.. అరంగ్రేట ఆట‌గాడితో విరాట్ కోహ్లీ గొడ‌వ‌..

కాగా.. 19 ఏళ్ల అరంగ్రేట ఆట‌గాడు సామ్ ప‌ట్ల కోహ్లీ వ్య‌వ‌హరించిన తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. కోహ్లీ ఉద్దేశ్య‌పూర్వంగానే ఇలా చేశార‌ని అంటున్నారు. ఇక ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఓ ఆట‌గాడు ఉద్దేశ్య పూర్వ‌కంగా భౌతికంగా ఢీ కొట్ట‌డాన్ని లెవ‌ల్ 2 నేరంగా ప‌రిగ‌ణిస్తారు. అప్పుడు ఆట‌గాడి ఖాతాలో మూడు లేదా 4 డీ మెరిట్ పాయింట్స్ జోడిస్తారు. మ్యాచ్ ఫీజులో 50 శాతం లేదా పూర్తి మ్యాచ్ ఫీజును జ‌రిమానాగా విధిస్తారు.

ఓ ఆట‌గాడి ఖాతాలో గ‌డిచిన 24 నెల‌ల్లో నాలుగు డీమెరిట్ పాయింట్స్ చేరితే.. ఓ టెస్టు మ్యాచ్ లేదా రెండు ప‌రిమిత ఓవ‌ర్ల మ్యాచులు ఆడ‌కుండా నిషేదం విధిస్తారు. ప్ర‌స్తుతం కోహ్లీ ఖాతాలో ఒక్క డీమెరిట్ పాయింట్ కూడా లేదు. అయితే.. తాజా ఘ‌ట‌న‌ను మ్యాచ్ రిఫ‌రీ తీవ్రంగా ప‌రిగ‌ణించి కోహ్లీ ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్స్ కేటాయిస్తే.. అప్పుడు కోహ్లీ ఓ మ్యాచ్ నిషేదాన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. అదే గ‌నుక జ‌రిగితే బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్‌లో చివ‌రిదైన సిడ్నీ టెస్టులో కోహ్లీ ఆడ‌లేదు.