Womens World Cup Semi Final Weather Update Will Rain Spoil IND W AUS W match
IND W vs AUS W : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో నేడు (అక్టోబర్ 30 గురువారం) రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన హర్మన్ ప్రీత్ సేన న్యూజిలాండ్ పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. మరోవైపు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఆసీస్ సెమీస్‌కు చేరుకుంది. కాగా.. టీమ్ఇండియా ప్రపంచకప్ ఆశలు సజీవంగా ఉండాలంటే సెమీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించాల్సి ఉంటుంది.
లీగ్ దశలో భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 330 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే.. పేలవ బౌలింగ్‌తో 331 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. సెమీస్‌లోనూ రెండు జట్లు హోరాహోరీగా పోటీపడే అవకాశం ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో భారత ప్లేయర్లతో పాటు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Shreyas Iyer : ప్రాణాంతక గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్.. ‘రోజు రోజుకు నేను.. ‘
నవీ ముంబైలో ఇటీవల వాతావరణ పరిస్థితులు చాలా అనిశ్చితంగా ఉన్నాయి. ఇప్పటికే ముంబైలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని ఆక్యూవెదర్ తెలిపింది.
ప్రస్తుతం ఎలాంటి వర్షం లేనప్పటికి కూడా మ్యాచ్ సమయానికి (మధ్యాహ్నం 3 గంటలు) భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంటున్నారు . ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే శుక్రవారం(అక్టోబర్ 31) ఉంది. ఈ రోజు మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు లేకుంటే రేపు నిర్వహిస్తారు. అయితే.. దురదృష్టకరమైన విషయం ఏంటంటే రేపు కూడా భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే.. ఆగిపోయిన ఓవర్ల నుంచే రిజర్వ్ డే రోజు ఆటను కొనసాగిస్తారు.
ఈ రోజు, రేపు మ్యాచ్ జరిగే పరిస్థితులు లేకుండా ఉండి, రద్దు అయితే మాత్రం గ్రూప్ స్టేజీలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంటుంది. అదే జరిగితే.. తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలన్న భారత ఆశ మరోసారి నెరవేరకుండానే టోర్నీ నుంచి నిష్ర్కమిస్తోంది.
కాగా.. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై దక్షిణాఫ్రికా విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఫైనల్‌లో సఫారీలు తలపడనున్నారు.