Shubman Gill
World Cup 2023 IND vs PAK ODI : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శనివారం భారత జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. అనారోగ్యం కారణంగా ప్రపంచకప్‌లో భారత్ ఆడిన తొలి రెండు మ్యాచులకు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ దూరం కాగా.. పాక్‌తో మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వచ్చాడు. అయితే.. టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు అనుమతి ఇస్తుందా..? లేక మరికొన్ని రోజులు విశ్రాంతి ఇస్తారా..? అన్న చర్చ ప్రస్తుతం నడుస్తోంది. కాగా.. గిల్‌ను తప్పకుండా పాక్‌తో మ్యాచ్‌లో ఆడించాలని భారత మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్‌కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.
కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న గిల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న గిల్ డిశ్చార్జి అయ్యాడు. వెంటనే అతడు అహ్మదాబాద్‌కు చేరుకున్నాడు. గురువారం నరేంద్ర మోదీ స్టేడియంలో గంట సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే.. మ్యాచ్ ఆడే ఫిట్‌నెస్ అతడు సాధించాడా..? లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో కొందరు గిల్‌ను పాక్‌తో మ్యాచ్ ఆడించాలని కోరుతుండగా మరికొందరు మాత్రం అతడికి విశ్రాంతి ఇవ్వాలని అంటున్నారు.
IND vs PAK : బాయ్‌కాట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. జవాన్ల ప్రాణాలు పోతుంటే..?
గిల్ ఖచ్చితంగా ఆడతాడు..!
ఈ క్రమంలో మీడియాతో భారత మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్‌కే ప్రసాద్ మాట్లాడుతూ.. శుభ్‌మన్ గిల్ ఖచ్చితంగా పాక్‌తో మ్యాచ్‌లో ఆడించాలని సూచించాడు. అతడు కోలుకున్నాడని, అతడు ఫిట్‌గా ఉంటే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఖచ్చితంగా ఆడతాడని అన్నారు. అన్ని రకాల ఊహాగాలను స్వప్తి చెప్పాలన్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున గిల్ ఆడాడు. గుజరాత్ టైటాన్స్‌కు హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియం గురించి గిల్‌కు పూర్తి అవగాహాన ఉందన్నాడు. ఈ మైదానంలో పరుగులు ఎలా చేయాలో అతడి తెలుసు. కీలక మ్యాచ్ కోసం భారత్ తన అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగాలి. అందులో గిల్ వంటి మ్యాచ్ విన్నర్ ఉండాలి అని ప్రసాద్ అన్నారు.
2023 సంవత్సరంలో వన్డేల్లో గిల్ అసాధారణ ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది 20 వన్డేలు ఆడిన గిల్ 105.03 స్ట్రైక్ రేటుతో 72.35 సగటుతో 1,230 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు ఉన్నాయి. ఒక్క ఏడాదిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ శతకాలు చేసిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల జాబితాలో గిల్ చేరాడు.