IND vs PAK : బాయ్‌కాట్ ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌.. జ‌వాన్ల ప్రాణాలు పోతుంటే..?

 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ కంటే కూడా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు క్రేజ్ ఎక్కువ అంటే అతిశ‌యోక్తి కాదేమో.

IND vs PAK : బాయ్‌కాట్ ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌.. జ‌వాన్ల ప్రాణాలు పోతుంటే..?

BoycottIndoPakMatch

Updated On : October 13, 2023 / 4:08 PM IST

World Cup 2023 IND vs PAK ODI : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ కంటే కూడా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు క్రేజ్ ఎక్కువ అంటే అతిశ‌యోక్తి కాదేమో. భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు ఎప్పుడెప్పుడు త‌ల‌ప‌డ‌తాయా అని క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. శ‌నివారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో భార‌త్, పాకిస్తాన్ జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు అహ్మ‌దాబాద్ చేరుకుని ప్రాక్టీస్ మొద‌లెట్టేశాయి.

కొంద‌రు అభిమానులకు భార‌త్, పాక్ మ్యాచ్ అంటే కేవ‌లం ఓ క్రికెట్ మ్యాచే కాదు.. ఓ భావోద్వేగంతో కూడిన ఓ మినీ యుద్ధం లాంటిది. ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌కున్నా ప‌ర్వాలేదు కానీ.. పాకిస్తాన్ పై మాత్రం ఖ‌చ్చితంగా గెల‌వాల్సిందేన‌ని కోరుకుంటారు అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. మామూలు వ‌న్డే మ్యాచుల్లో భార‌త్‌పై పాక్ రికార్డు చాలా బాగున్న‌ప్ప‌టికీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో మాత్రం ఘోరంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు ఏడు సార్లు ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఈ ఏడు మ్యాచుల్లో భార‌త్ విజేత‌గా నిలిచింది. ఈ విజ‌య‌ప‌రంప‌ర‌ను కొన‌సాగించాల‌ని స‌గ‌టు భార‌త అభిమాని కోరుకుంటున్నారు.

బాయ్‌కాట్ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌..

ఓ వైపు అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో బాయ్‌కాట్ ఇండియా, పాకిస్తాన్ అంటూ నెటీజ‌న్లు హోరెత్తిస్తున్నారు. ట్విట్ట‌ర్‌లో ప్ర‌స్తుతం #BoycottIndoPakMatch ట్రెండింగ్‌లో ఉంది. భార‌త్‌పై విషం వెళ్ల‌గ‌క్కే పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఏంటి అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఉగ్ర‌వాదులను భార‌త్‌లోకి పంపి బాంబు దాడులు చేస్తున్న పాక్‌తో ఆట‌లు ఆడ‌కూడ‌ద‌ని అంటున్నారు.

సెప్టెంబ‌ర్ 13న కాశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లాలోని కోకెర్‌నాగ్ ప్రాంతంలో ఉగ్ర‌వాదుల జ‌రిపిన కాల్పుల్లో భార‌త ఆర్మీ క‌ల్న‌ల్‌తో పాటు రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన మేజ‌ర్‌, డిప్యూటీ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ క‌మాండింగ్ మ‌ర‌ణించారు. జ‌వాన్ల మ‌ర‌ణాల నేప‌థ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను ఇండియా ఆడ‌కూడ‌ద‌ని ప‌లువురు నెటీజ‌న్లు పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్‌ను బాయ్ కాట్ చేయాల్సిందేన‌ని కోరుకుతున్నారు.

భార‌త్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట‌ర్లు అహ్మ‌దాబాద్ చేరుకోగా వారికి గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ ఘ‌న స్వాగ‌తం ప‌లికింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. భార‌త సైనికుల‌ను ఉగ్ర‌వాదులు చంపుతుంటే పాక్ ఆట‌గాళ్ల‌కు ఘ‌న స్వాగ‌తాలు, స‌త్కారాలు చేయ‌డంపై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు.

బీసీసీఐ ప్ర‌త్యేక ఏర్పాట్లు..

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ కోసం భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీ ఎలాంటి వేడుక‌లు లేకుండా ప్రారంభం కావ‌డంతో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నుంది. బాలీవుడ్ గాయకులు అరిజిత్ సింగ్, శంకర్ మహదేవన్, సుఖ్‌విందర్ సింగ్ లు త‌మ గానంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నారు. ఆ త‌రువాత లైటింగ్ షో ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి గోల్డెన్ టికెట్ అందుకున్న‌ సచిన్‌ టెండుల్కర్‌, అమితాబ్‌ బచ్చన్‌, రజినీకాంత్ ల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీల‌ను బీసీసీఐ ఆహ్వానించింది.