IND vs NZ
India vs New Zealand : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి న్యూజిలాండ్, టీమ్ఇండియా జట్లు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం కీలక పోరు జరగనుంది. అయితే.. గత కొన్నాళ్లుగా ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ జట్టు భారత్‌పై ఆధిపత్యం చలాయిస్తోంది. అదే ఊపును ఈ సారి కంటిన్యూ చేయాలని న్యూజిలాండ్ ఆరాడపడుతోండగా.. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ఇండియా పట్టుదలగా ఉంది.
ఇదే ఆఖరి విజయం..
సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 2003 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను భారత జట్టు ఓడించింది. ఆ మ్యాచ్‌లో కివీస్‌ను 146 పరుగులకే ఆలౌట్ చేసిన టీమ్ఇండియా లక్ష్యాన్ని 56 బంతులు మిగిలి ఉండగా మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ తరువాత నుంచి నేటి వరకు ఐసీసీ టోర్నీల్లో కివీస్ పై భారత్ మరో విజయాన్ని నమోదు చేయలేదు.
ఐసీసీ టోర్నీల్లో భారత్ పై కివీస్ ఆధిపత్యం ఇలా..
2007 టీ20 ప్రపంచకప్‌తో మొదలు..
2007 టీ20 ప్రపంచకప్‌ను టీమ్ఇండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో భారత్ ఓడిన ఏకైక మ్యాచ్ న్యూజిలాండ్ చేతిలోనే కావడం గమనార్హం. బ్రెండన్ మెకల్లమ్ (31 బంతుల్లో 45), క్రెయిగ్ మెక్‌మిలన్ (23 బంతుల్లో 44), జాకబ్ ఓరమ్ (15 బంతుల్లో 35) చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 190 పరుగుల భారీ స్కోరు చేసింది. గౌతమ్ గంభీర్ 33 బంతుల్లో 51, వీరేంద్ర సెహ్వాగ్ 17 బంతుల్లో 40 పరుగులు చేయడంతో పాటు 5.5 ఓవర్లలోనే 76 పరుగుల మొదటి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన భారత్ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
Pujara : కోహ్లీ సెంచరీ చేసిన తీరుపై పుజారా సంచలన వ్యాఖ్యలు.. జట్టుకు నష్టం..!
2016 టీ20 ప్రపంచ కప్..
స్వదేశంలో జరిగిన 2016 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు సత్తా చాటడంతో కివీస్ 126/7 స్కోరుకే పరిమితమైంది. అయితే.. బ్యాటర్లు విఫలం కావడంతో 79 పరుగులకే భారత్ కుప్పకూలింది. ధోనీ (30), కోహ్లీ(23), అశ్విన్ (10) మినహా మిగిలిన వారు ఎవరు కూడా రెండు అంకెల స్కోరు చేయలేకపోయారు.
2019 వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో.. ధోనీ రనౌట్
ఈ మ్యాచ్‌ను అభిమానులు అంత త్వరగా మరిచిపోలేరు. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. అయితే.. ఈ లక్ష్య ఛేదనలో భారత్ 221 పరుగులకే పరిమితమైంది. దీంతో 18 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్ వన్డే ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ(1), రోహిత్ (1), కేఎల్ రాహుల్ (1) దారుణంగా విపలం కావడంతో 5 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. రవీంద్ర జడేజా (77), మహేంద్ర సింగ్ ధోనీ(50) ఎంతో పట్టుదలతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. 216 పరుగుల వద్ద ధోని రనౌట్ అయ్యి తొమ్మిదో వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరుకోవడంతో అభిమానుల గుండెలు బద్దలు అయ్యాయి.
2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్..
ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మొట్ట మొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ టీమ్ఇండియాను కివీస్ మట్టికరిపించింది. తద్వారా ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 217 పరుగులు చేయగా కివీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 249 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 170 పరుగులకు ఆలౌట్ కాగా కివీస్ ముందు 138 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని కివీస్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
2021 టీ20 ప్రపంచ కప్..
2021 టీ20 ప్రపంచకప్‌లో 8 వికెట్ల తేడాతో కివీస్ గెలిచింది. న్యూజిలాండ్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధి లు రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 110/7కి పరిమితమైంది. మిచెల్ (49), విలియమ్సన్ (33 నాటౌట్) రాణించడంతో లక్ష్యాన్ని కివీస్ 14.3 ఓవర్లలోనే ఛేదించింది.
ఇలా 2003 తరువాత నుంచి ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు కివీస్ చేతిలో కంగుతింటూ వస్తోంది. ఈ పరాజయాల పరంపరకు బ్రేక్ వేయాలని టీమ్ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు.