WPL 2024 : హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం.. బెంబేలెత్తిపోయిన గుజరాత్ జెయింట్స్ బౌలర్లు

హర్మన్ ప్రీత్ దూకుడును అడ్డుకోవటంలో గుజరాత్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా విజయం ఖాయమని భావించినప్పటికీ..

Harmanpreet Kaur

Harmanpreet Kaur : ఉమెన్స్ ప్రీమిలియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో 16వ మ్యాచ్ శనివారం రాత్రి అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ – గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరిగింది. ఇరు జట్ల మధ్య చివరి వరకు గెలుపు దోబూచులాడుతూ వచ్చింది. చివరిలో ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సుడిగాలి ఇన్నింగ్స్ తో సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడటంతో ముంబై జట్టు విజయతీరాలకు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసింది. ఆ జట్టులో హేమలత 40 బంతుల్లోనే 74 పరుగులు చేసింది. ముంబై బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోయారు.

Also Read : Shoaib Bashir : ఏమ‌య్యా బ‌షీర్‌.. క్లీన్‌బౌల్డ్‌కు రివ్య్వూనా? చూడు అంద‌రూ ఎలా న‌వ్వుతున్నారో.. వీడియో

భారీ స్కోర్ ఛేదనకు బరిలోకి దిగిన ముంబై జట్టు ప్రారంభం నుంచి నెమ్మదిగా ఆడుతూ వచ్చింది. ఈ క్రమంలో 15 ఓవర్లకు కేవలం 119 పరుగులు మాత్రమే చేసింది. మిగిలిన ఐదు ఓవర్లలో 14పైన రన్ రేట్ తో పరుగులు సాధించాల్సి ఉండగా.. ముంబై జట్టు ఓడిపోతుందని అందరూ భావించారు. కానీ హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసకర బ్యాటింగ్ తో గుజరాత్ జెయింట్స్ బౌలర్లపై విరుచుకు పడింది. తొలుత హర్మన్ ప్రీత్ కౌర్ నెమ్మదిగా ఆడింది. క్రీజులో నిలదొక్కుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చింది. దీంతో ఆమె 21 బంతుల్లో చేసిన స్కోరు 20 పరుగులు మాత్రమే. ఆ తరువాత 27 బంతుల్లో 75 పరుగులు చేసింది. మొత్తం 10 ఫోర్లు, ఐదు సిక్సుల సహాయంతో హర్మన్ ప్రీత్ కేవలం 48 బంతుల్లో 95 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.

Also Read : Ravichandran Ashwin : వందో టెస్టులో అద‌ర‌గొట్టిన అశ్విన్‌.. అనిల్ కుంబ్లే రికార్డు బ‌ద్ద‌లు.. తొలి భార‌తీయుడిగా..

హర్మన్ ప్రీత్ దూకుడును అడ్డుకోవటంలో గుజరాత్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా విజయం ఖాయమని భావించినప్పటికీ.. హర్మన్ ప్రీత్ రూపంలో గుజరాత్ జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లో విజయంతో ముంబయి జట్టు ప్లే ఆప్స్ లోకి చేరిపోయింది.