ACs Refrigerators Prices Increase : సమ్మర్ వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి.. ఎయిర్ కండీషనర్లు, రిఫిజరేటర్లు, కూలర్ల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఎలక్ట్రానిక్ కంపెనీలు తమ ప్రొడక్టుల ధరలు పెంచాలని భావిస్తున్నాయి. ప్రధానంగా ఏసీలు, రిఫ్రిజరేటర్లు, కూలర్లపై భారీగా ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే పలు ఎలక్ట్రానిక్ తయారీ వ్యయాలు పెరిగిపోవడంతో చాలావరకు కంపెనీలు ధరలు పెంచేశాయి. ఇప్పుడు మరికొన్ని కంపెనీలు 3 నుంచి 8 శాతం పెంచాలని చూస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ధరను 5 నుంచి 8 శాతం పెంచాలని యోచిస్తున్నాయి.
వోల్టాస్, డైకిన్, ఎల్జీ, పానాసోనిక్, హైయర్, బ్లూ స్టార్, శాంసంగ్ వంటి సంస్థలు ధరలను పెంచేశాయి. వేసవిలో కూడా ఏసీలు, రిఫ్రిజరేటర్లు, కూలర్ల వినియోగం అధికంగా ఉండటంతో వీటికి ఎక్కువగా డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు తమ వినియోగదారుల ఆరోగ్యం కోసం ఎలక్ట్రానిక్ ప్రొడక్టులకు అదనపు సౌకర్యాలను అందిస్తున్నాయి.
అమ్మకాలు మరింత పెరిగేందుకు వీలుగా కంపెనీలు అదనపు ఖర్చు లేకుండా నెలవారీ వాయిదాలలో చెల్లింపు (EMI), క్యాష్‌బ్యాక్ వంటి స్కీమ్, ఆఫర్లను అందిస్తున్నాయి. ఏసీల తయారీకి వినియోగించే లోహాలు, కంప్రెషర్లు ధరలు పెరగడంతో ఏసీల ధరలు 3-5 శాతం పెరిగే అవకాశం ఉందని దైకిన్ ఎయిర్‌కండిషనింగ్ ఇండియా ఎండీ, సీఈఓ కన్వాల్ జీత్ తెలిపారు. మార్కెట్ ప్రకారం.. ఏసీల ధరలు 6-8 శాతం, రిఫ్రిజరేటర్ ధరలు 3-4 శాతం పెంచాలని భావిస్తున్నట్లు పానసోనిక్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు మనీశ్ శర్మ వెల్లడించారు.
ఏసీల ధరలు పెంచినప్పటికీ వేసవిలో గిరాకీ ఎక్కువగానే ఉంటుందని వోల్టాస్ ఎండీ, సీఈఓ ప్రదీప్ భక్షి పేర్కొన్నారు. ఎయిర్ కండిషన్ ధరను మూడు నుండి ఐదు శాతం పెంచే అవకాశం ఉంది. రిఫ్రిజిరేటర్ల ధర కనీసం 3-4 శాతం పెరుగుతుందని పానాసోనిక్ సీఈఓ మనీష్ శర్మ తెలిపారు. ఏప్రిల్ నుంచి ఏసీల ధరను మూడు శాతం పెంచబోతున్నట్లు బ్లూ స్టార్ ఎండి బి త్యాగరాజన్ వెల్లడించారు. బ్లూ స్టార్ కూడా జనవరిలో ఏసీల ధరను ఐదు నుంచి ఎనిమిది శాతం పెంచింది.