Geoffrey Hinton : ఏఐతో సంప‌ద పెరిగినా సంపన్నుల చేతుల్లోకే పోతుంది.. : ఏఐ గాడ్‌ఫాద‌ర్ హెచ్చరిక

ఏఐ టెక్నాలజీతో సంపదను ఉత్పత్తి చేసినప్పటికీ, అది ధనవంతుల చేతుల్లో మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా, ఉద్యోగాలు కోల్పోయే వారికి, సమాజానికి చేటు చేస్తుందని హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు.

AI Godfather Geoffrey Hinton : ఇప్పుడు ఏఐదే ట్రెండ్.. టెక్ రంగంలో ఏఐ టాపిక్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. 2022లో ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ అడుగుపెట్టింది. అంతే.. ప్రపంచమంతా అప్పటినుంచి ఏఐ గురించే మాట్లాడటం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే, పేరంట్ కంపెనీ ఓపెన్ఏఐ బాగా ప్రజాదరణ పొందింది. అదే.. సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఇంటి పేరుగా మారింది. అదే సమయంలో చాట్‌జీపీటీకి పోటీగా అనేక టెక్ కంపెనీలు సైతం సొంత ఏఐ టూల్స్ తీసుకొచ్చేశాయి. ఇప్పటికే గూగుల్ వంటి ఐటీ దిగ్గజాలు సైతం సొంత ఏఐ టెక్నాలజీతో పనిచేసే చాట్‌బాట్ టూల్స్ ప్రవేశపెట్టాయి. అయితే, ప్రారంభంలో చాట్‌జీపీటీ ఏఐ (కృత్రిమ మేధస్సు)తో మానవాళిపై ప్రభావం గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి.

Read Also : Sundar Pichai Advice : భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు సుందర్ పిచాయ్ టిప్స్.. అమీర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ మాదిరిగా బట్టి కొట్టడమే..!

మానవాళికి ముప్పు.. ఉద్యోగులు ఊడిపోతాయి :
ఏఐ కొత్త అవకాశాల సృష్టికి దారితీస్తుందని, రోజువారీ జీవితంలో మానవులకు సాయం చేస్తుందని కొందరు నిపుణులు విశ్వసించగా, ఏఐ మానవులను పూర్తిగా భర్తీ చేయగలదని మరికొందరు నిపుణులు వాదించారు. ఏఐ రాకతో ఎక్కడ తమ ఉద్యోగాలు ఊడిపోతాయనే టెక్ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఈ తరుణంలో ఏఐ గాడ్ ఫాదర్‌గా పేరొందిన వారిలో ఒకరైన జెఫ్రీ హింటన్ కూడా గత కొన్నాళ్లుపై ఈ కొత్త టెక్నాలజీపై ఆందోళనగా ఉన్నారు. ఏఐతో మానవాళికి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏఐ కారణంగా మనుషులు చేసేందుకు పనులు లేకుండా పోతాయనేది తనను చాలా ఆందోళనకు గురిచేస్తోందని హింటన్ పేర్కొన్నారు.

ఏఐ సంపద సంపన్నుల చేతుల్లోకి :
అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఉత్పాదకతకు దోహదపడుతుందని, అదే సంపదను ఉత్పత్తి చేస్తుందని కూడా ఆయన అన్నారు. అంతేకాదు.. ఈ సంపద ధనికుల చేతుల్లోకి మాత్రమే వస్తుందని చెప్పారు. మరో మాటలో చెప్పాలంటే.. ఏఐ ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చినప్పటికీ.. సంపదను ఉత్పత్తి చేసినప్పటికీ, అది ధనవంతుల చేతుల్లో మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా, ఉద్యోగాలు కోల్పోయే వారికి, సమాజానికి చేటు చేస్తుందని హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. హింటన్ ప్రకారం.. దీనికి పరిష్కారం ఏఐ కారణంగా ప్రజలు ఇబ్బందిపడకుండా ప్రభుత్వం అందించే ప్రాథమిక ఆదాయమేనని స్పష్టం చేశారు. గతంలో తనను డౌనింగ్ స్ట్రీట్‌లోని కొంతమంది సంప్రదించారని, వారికి సార్వత్రిక ప్రాథమిక ఆదాయం మంచి ఆలోచన అని తాను వారికి సలహా ఇచ్చానని హింటన్ తెలిపారు.

ఏఐ ముప్పును ముందే పసిగట్టిన హింటన్ :
హింటన్.. ఒక దశాబ్దం పాటు గూగుల్ కంపెనీలో పనిచేశాడు. కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తన ఇద్దరు విద్యార్థులతో కలిసి, చాట్‌జీపీటీ, బింగ్, బార్డ్ చాట్‌బాట్‌ల ఆధారంగా పనిచేసే న్యూరల్ నెట్‌వర్క్‌ను సృష్టించాడు. అయినప్పటికీ, త్వరగానే ఏఐతో తలెత్తే ప్రమాదాలను హింటన్ గ్రహించాడు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ప్రమాదాల గురించి ప్రపంచాన్ని హెచ్చరించడానికి గూగుల్‌లో తన ఉద్యోగానికి వీడ్కోలు పలికాడు. గత ఏడాది అక్టోబర్‌లో ఓ మీడియాకు ఇంటర్వ్యూలో ఏఐ మానవులను నాశనం చేసే అవకాశం గురించి హింటన్ ఆందోళన చెందారు. ఏఐ మొదటిసారిగా మనకంటే ఎక్కువ తెలివైన విషయాలను కలిగి ఉండవచ్చనని చెప్పాడు.

Read Also : Vivo Y200 Pro 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? యాంటీ షేక్ కెమెరాతో వివో Y200 ప్రో 5జీ ఫోన్.. భారత్‌లో ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు