Google Payతో జాగ్రత్త.. రివార్డులు చూసి టెంప్ట్ అవొద్దు.. క్లిక్ చేశారా? ఖతమే!

  • Publish Date - October 8, 2020 / 03:08 PM IST

Google Pay: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ గూగుల్ పే ద్వారా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ మోసగాళ్లు.. డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు పేటీఎం, ఫోన్ పేతోపాటు గూగుల్ పే ఎక్కువగా వాడుతున్నారు. ప్రతి యాప్‌లోనూ ట్రాన్సాక్షన్లపై రివార్డులు, స్ర్కాచ్ కార్డులు ఆఫర్లు అందిస్తున్నాయి డిజిటల్ పేమెంట్ సంస్థలు. అయితే వీటినే లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు యూజర్లను నమ్మించి మోసాలకు పాల్పుడుతున్నారు.



గూగుల్ పేలో ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు రివార్డు స్ర్కాచ్ కార్డు (Rewards Scratch cards) రావడం కామన్.. క్యాష్ బ్యాక్ రూపంలో తిరిగి అకౌంట్లో నగదు వస్తుంది. అందుకే ఎక్కువమంది యూజర్లు గూగుల్ పే ద్వారా లావాదేవీలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఆన్ లైన్ మోసగాళ్లు కూడా ఈ సరికొత్త ఆన్ లైన్ మోసానికి పాల్పడుతున్నారు. గూగుల్ పే నుంచి మీకు ఏదైనా రివార్డు మెసేజ్ వస్తే తొందరపడకండి.. ఆ మెసేజ్ నిజంగా గూగుల్ పే సంస్థ పంపినదా? లేదా ఆన్ లైన్ మోసగాళ్ల పని అనేది నిర్ధారించుకోవాలి.



క్లిక్ చేశారంటే ఖతమే.. అకౌంట్ ఖాళీ :
సాధారణంగా గూగుల్ పే అందించే రివార్డుల మాదిరిగానే ఉంటుంది ఆ మెసేజ్.. గూగుల్ పేను పోలిన పేజీ ఒకటి ఓపెన్ అవుతుంది. స్ర్కాచ్ కార్డు మాదిరిగా కనిపిస్తుంది. దానిపై స్ర్కాచ్ చేస్తే ఎంతో కంత అమౌంట్ కనిపిస్తుంది. ఆ మొత్తం ఆటోమాటిక్‌గా ప్రైమరీ బ్యాంకు అకౌంట్లో పడిపోతుంది. ఇదే తరహాలో ఆన్ లైన్ మోసగాళ్లు.. స్ర్కాచ్ కార్డులతో మోసానికి పాల్పడుతున్నారు. స్ర్కాచ్ కార్డుపై రూ.2000 లేదా రూ.5,000 రివార్డు క్యాష్ బ్యాక్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేశారంటే ఖతమే.. అకౌంట్లో డబ్బులు ఖాళీ అవ్వడం ఖాయం..



వాస్తవానికి గూగుల్ పేలో రివార్డులు (Google Pay Rewards) వచ్చాయంటూ ఎలాంటి మెసేజ్, వాట్సాప్ మెసేజ్ లు పంపదు.. ఒకవేళ వచ్చాయంటే మాత్రం అది పక్కా ఫేక్ అని గుర్తించాలి. మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి రివార్డులు కనిపిస్తాయి. అప్పుడే స్ర్కాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా రివార్డు వచ్చి ఉంటే ఆ మొత్తం మీ అకౌంట్లోనే క్రెడిట్ అయిపోతుంది.



ఇలా వస్తే.. 100 శాతం ఫ్రాడ్ :
గూగుల్ పేలో భారీ మొత్తంలో రివార్డులు రావు.. ఒకవేళ వస్తే.. రూ.5 నుంచి రూ.51, రూ.80, రూ.110 లేదంటే గరిష్టంగా రూ.500 వరకు రావొచ్చు.. అంతేకానీ, రూ.10వేలు, రూ.20వేలు అంటూ భారీ మొత్తంలో మాత్రం రివార్డులు రావనే విషయాన్ని గుర్తించుకోండి.. అలా ఏదైనా మెసేజ్ గూగుల్ పే (Google Pay Online Frauds) నుంచి వచ్చినట్టుగా వస్తే మాత్రం అలాంటి మెసేజ్ 100శాతం ఫ్రాడ్ అనే విషయం గుర్తించుకోవాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి మెసేజ్ లు వస్తే వెంటేనే డిలీట్ చేసేయండి.. ఆ లింకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు.. బీ కేర్ ఫుల్..