రేపటి నుంచి కొత్త ఓటర్ల నమోదు..

  • Published By: Mahesh ,Published On : December 25, 2018 / 06:52 AM IST
రేపటి నుంచి కొత్త ఓటర్ల నమోదు..

 తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా వార్షిక ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం నుంచి పునఃప్రారంభించనుంది. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన పౌరులు ఓటరు నమోదుకు అర్హులు కానున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను సీఈసీ బుధవారం ప్రకటించనుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం సూచించింది. ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలన్నారు. ఒకవేళ పేర్లు గల్లంతైతే మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

ఈ నెల 26 నుంచి జనవరి 25 వరకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనుంది. ఈ దరఖాస్తులు, అభ్యంతరాలను పరిశీలించి ఫిబ్రవరి 11 నాటికి పరిష్కరించనుంది. ఫిబ్రవరి 18 నాటికి ఓటర్ల జాబితాలో మార్పుచేర్పులు చేయడంతోపాటు అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. ఫిబ్రవరి 22న తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటించనుంది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇదే జాబితాను వినియోగించనుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ నెల 26న ప్రకటించనున్న ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించి చూసుకోవాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.