భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తుపాకులు, ట్యాంకులు, క్షిపణుల వంటి సంప్రదాయ ఆయుధాల తయారీ నుంచి తప్పుకుని, భవిష్యత్ యుద్ధాల గమనాన్ని మార్చే సరికొత్త సాంకేతికతలపై దృష్టి పెట్టనుంది. దీనినే “DRDO 2.0” అని పిలుస్తున్నారు.
అంటే, ఇకపై DRDO లేజర్ ఆయుధాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో పరిశోధనలు చేయనుంది. ఈ మార్పు వెనుక ఉన్న కారణాలు ఏంటి? దీనివల్ల భారత రక్షణ రంగం ఎలా మారబోతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎందుకు ఈ మార్పు?
“భవిష్యత్తులో యుద్ధాన్ని గెలవాలంటే అడ్వాన్స్డ్‌గా ఉండాలి. అది కేవలం సైనికుల మధ్య జరిగే పోరాటం కాదు.. అది టెక్నాలజీల మధ్య జరిగే యుద్ధం” అని DRDO సీనియర్ అధికారి డా. బి.కె.దాస్ స్పష్టం చేశారు. ఈ కొత్త వ్యూహం వెనుక ఉన్న ప్రధాన అంశాల గురించి తెలిపారు.
సంప్రదాయ ఆయుధాల తయారీ, అభివృద్ధి బాధ్యతలను ఇకపై ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తారు. వాటికి DRDO కేవలం సాంకేతిక మద్దతు మాత్రమే అందిస్తుంది. DRDO తన పూర్తి సమయాన్ని, వనరులను దీర్ఘకాలిక పరిశోధనలపై కేంద్రీకరిస్తుంది.
Also Read: ఈ పాపులర్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.. ఆలోచించిన ఆశాభంగం
భవిష్యత్‌లో ఈ ఆయుధాలు
DRDO ఇప్పటికే కొన్ని ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలలో గణనీయమైన పురోగతి సాధించింది.
లేజర్ ఆయుధాలు (Directed Energy Weapons – DEWs)
“ఒక క్షిపణిని ఎదుర్కోవడానికి మరో ఖరీదైన క్షిపణిని ప్రయోగించడం ఆర్థికంగా లాభదాయకం కాదు. అందుకే లేజర్లు, మైక్రోవేవ్‌లతో శత్రువుల డ్రోన్లను, క్షిపణులను గాలిలోనే కాల్చేయడం ఉత్తమం” అని డా. దాస్ అన్నారు.
ఇప్పటికే 30 కిలోవాట్ల శక్తిమంతమైన లేజర్ ఆయుధాన్ని భారత్ అభివృద్ధి చేసింది. 2 కిలోవాట్ల లేజర్ వ్యవస్థను D4 యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లో విజయవంతంగా పరీక్షించారు.
ఫోటానిక్ రాడార్ (Photonic Radar)
సాధారణ రాడార్ల కంటే అత్యంత కచ్చితత్వంతో పనిచేసే ఫోటానిక్ రాడార్‌ను భారత్ అభివృద్ధి చేసింది. ఇది శత్రు విమానాలను, డ్రోన్లను చాలా ముందుగానే గుర్తిస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ టెక్నాలజీ
ఈ రంగాల్లో ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయని DRDO అంగీకరించింది. “ఇది పిజ్జా తయారీ లాంటిది. ఇప్పుడు పిజ్జా కనిపించకపోవచ్చు, కానీ దానికి కావాల్సిన పదార్థాలను మేం సిద్ధం చేస్తున్నాం” అని డా. దాస్ సరదాగా తెలిపారు.
ప్రాజెక్టుల ఆలస్యంపై DRDO ఏమంటోంది?
DRDO ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయనే విమర్శలపై దాస్ స్పందిస్తూ.. గతంలో ప్రాజెక్టుల సంక్లిష్టతను తక్కువగా అంచనా వేయడం వల్లే అలా జరిగిందని అంగీకరించారు. ఇప్పుడు ఆ పొరపాట్లు జరగకుండా, ప్రైవేట్ కంపెనీలను ఆరంభం నుంచే భాగస్వాములను చేస్తున్నాం అని అన్నారు. దీన్ని DCPP మోడల్ అంటారు.
DRDO అభివృద్ధి చేసిన ఆకాశ్, బ్రహ్మోస్ క్షిపణులు, D4 యాంటీ-డ్రోన్ సిస్టమ్ వంటివి ఇప్పటికే భారత సైన్యం విజయవంతంగా ఉపయోగిస్తోంది.
DRDO 2.0 అనేది కేవలం ఒక మార్పు కాదు.. భారత రక్షణ రంగం భవిష్యత్తుకు వేస్తున్న బలమైన పునాది. ఈ వ్యూహాత్మక మార్పుతో, భారత్ రాబోయే దశాబ్దాలలో ప్రపంచ రక్షణ రంగంలో ఒక కీలక శక్తిగా ఎదగడం ఖాయం.