Earthquake Alert : మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు.. భూకంపాలు, సునామీలను ముందే పసిగట్టేయొచ్చు.. ఈ ఫీచర్ ఇలా ఆన్ చేయండి..!
Earthquake Alert : రష్యా, జపాన్‌లో భూకంపం, సునామీ హెచ్చరికలు.. సమీప ప్రాంతాల్లోని మన భారతీయులు ఈ ఆండ్రాయిడ్ ఫీచర్‌తో ముందే అలర్ట్ అవ్వొచ్చు.

Earthquake Alert
Earthquake Alert : ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఎలాంటి అలర్ట్స్ లేకుండానే హఠాత్తుగా భూకంపాలు (Earthquake Alerts) సంభవిస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో తీవ్ర ఆస్తినష్టంతో ప్రాణనష్టం కూడా ఉంటుంది.
అందుకే ముందస్తు హెచ్చరికలు ఉంటే కొన్ని సెకన్ల వ్యవధిలోనే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. ఢిల్లీ-NCR ప్రాంతంలో కూడా సాపేక్షంగా రెడ్ అలర్ట్‌లో ఉంది. ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో తరచుగా భూప్రకంపనలు సంభవిస్తాయి.
కొన్నిసార్లు నెలలో చాలాసార్లు కూడా భూకంపాలు సంభవిస్తాయి. ఈ భూకంపాలలో చాలా వరకు స్వల్పమైనవి. ఎలాంటి నష్టం కలిగించవు. ఉత్తర భారత ప్రాంతం సమీప-క్షేత్ర, దూర-క్షేత్ర భూకంపాలకు గురవుతుంది.
ఈ ప్రాంతం భారత టెక్టోనిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ప్రకృతి వైపరీత్యాలను ఎలాగో ఆపలేం. కానీ, టెక్నాలజీ సాయంతో ముందుగానే అప్రమత్తంగా ఉండవచ్చు. భూకంపం రావడానికి ముందే సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోవచ్చు.
Read Also : రష్యాలో భయంకరమైన భూకంపం.. రష్యా, జపాన్‌లో సునామీ.. అమెరికా, చైనాలోనూ హెచ్చరికలు జారీ..
భూకంపం గురించి ముందుగానే అప్రమత్తం చేసేందుకు గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ప్రత్యేక నోటిఫికేషన్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల కోసం గూగుల్ ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థను డెవలప్ చేసింది.
ఈ ఫీచర్ భూకంపాలను గుర్తించేందుకు వీలుగా ముందస్తు హెచ్చరికలను అందించే మినీ-సీస్మోమీటర్‌లుగా ఉపయోగిస్తుంది. ఇతర డివైజ్‌ల డేటాతో కలిపినప్పుడు భూకంపం వచ్చిన లొకేషన్, తీవ్రతను వేగంగా అంచనా వేయగలదు. ఒక ఆండ్రాయిడ్ ఫోన్ అసాధారణ భూప్రకంపనలను గుర్తిస్తే.. వెంటనే ఆయా లొకేషన్‌తో డేటాను గూగుల్ సర్వర్‌లకు పంపుతుంది.
భూకంప కేంద్రానికి సమీపంలోని ప్రాంతం నుంచి ఇలాంటి సంకేతాలను అందుకున్నప్పుడు ఆండ్రాయిడ్ సిస్టమ్ అలర్ట్ అవుతుంది. వెంటనే ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారులకు హెచ్చరికలను పంపుతుంది.
కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్ వంటి ప్రాంతాలలో భూకంపాలను ముందుగానే గుర్తించేందుకు 1,600 కన్నా ఎక్కువ భూకంప సెన్సార్లతో షేక్అలర్ట్ నెట్‌వర్క్‌తో గూగుల్ భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ సెన్సార్లు ఆండ్రాయిడ్ సిస్టమ్‌లోకి డేటాను ఫీడ్ చేస్తాయి. సమీపంలోని వినియోగదారులకు భూకంప హెచ్చరికలను పంపుతుంది.
గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్లకు రెండు రకాల భూకంప అలర్ట్స్ పంపుతుంది.
జాగ్రత్తగా ఉండండి : తేలికపాటి భూప్రకంపనలకు (తీవ్రత 4.5+) కోసం ఈ అలర్ట్ వస్తుంది.
వెంటనే అప్రమత్తం అవ్వండి : తీవ్రమైన భూప్రకంపనలకు ఈ నోటిఫికేషన్లు వస్తాయి. మీ ఫోన్ సెట్టింగ్స్ ద్వారా పెద్దగా సౌండ్స్, ఎమర్జెన్సీ అలర్ట్స్ వస్తాయి. తద్వారా మీరు వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లవచ్చు.
భూకంప అలర్ట్స్ ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలి? :
- మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థను ఇలా ఆన్ చేయొచ్చు.
- మీ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 5.0 లేదా ఆపై వెర్షన్ తప్పక కలిగి ఉండాలి.
- మీకు యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్, లొకేషన్ సర్వీసులు ఆన్ చేసి ఉండాలి.
- ఆ తర్వాత మీ ఫోన్‌లోని Settings ఐకాన్ ట్యాప్ చేసి (Safety & Emergency)కి వెళ్లండి.
- మీకు ఆప్షన్ కనిపించకపోతే Location ఓపెన్ చేసి Advanced ఆప్షన్ ట్యాప్ చేయండి.
- మెనూలో భూకంప హెచ్చరికలకు సంబంధించి అలర్ట్స్ చెక్ చేయండి.
- ఒకవేళ ఈ ఆప్షన్ స్విచ్ ఆఫ్‌లో ఉంటే వెంటనే ON చేయండి.
ఒకసారి ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే చాలు.. మీ ఫోన్ యాక్టివ్‌గా లేకపోయినా మీకు అలర్ట్స్ అందుతాయి. భూకంపం రావడానికి ముందే అప్రమత్తం అవ్వొచ్చు. కొన్ని సెకన్ల ముందు హెచ్చరిక కూడా చాలా విలువైనది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ప్రాణపాయం నుంచి బయటపడొచ్చు. ఈ వ్యవధిలోనే నేలపై పడుకోవడం, ఫర్నిచర్ కింద దాచుకోవడం లేదా మీ కుటుంబ సభ్యులను భూకంప ప్రభావం నుంచి రక్షించుకోవచ్చు.
రష్యా, జపాన్‌లో సునామీ.. భారీ భూకంపం.. :
ప్రస్తుతం రష్యా తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో సునామీ వచ్చే అవకాశం ఉందంటూ ప్రపంచ దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కానీ, భారత్‌కు ఎలాంటి సునామీ ముప్పులేదని, భారత సముద్ర భూభాగాలపై భూకంప తీవ్రత లేదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) వెల్లడించింది. అమెరికాలోని భారతీయ పౌరులకు ఇండియన్ కాన్సులేట్ జనరల్ హెచ్చరకిలు జారీ చేసింది. యూఎస్‌లోని తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.