రష్యాలో భయంకరమైన భూకంపం.. రష్యా, జపాన్‌లో సునామీ.. అమెరికా, చైనాలోనూ హెచ్చరికలు జారీ..

రష్యాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై 8.8గా నమోదైంది.

రష్యాలో భయంకరమైన భూకంపం.. రష్యా, జపాన్‌లో సునామీ.. అమెరికా, చైనాలోనూ హెచ్చరికలు జారీ..

Updated On : July 30, 2025 / 11:00 AM IST

రష్యాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై 8.8గా నమోదైంది. ఈ ప్రభావంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. రష్యాతో పాటు అమెరికా, జపాన్‌కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

రష్యా కురిల్ దీవుల్లో ప్రధాన నివాస ప్రాంతం సేవెరో-కురిల్స్‌క్ తీరాన్ని మొదటి సునామీ అల తాకింది అని స్థానిక గవర్నర్ వాలెరి లిమారెంకో చెప్పారు. అక్కడి ప్రజలు సురక్షితంగా ఉన్నారని, ప్రస్తుతం ఎత్తైన ప్రాంతాల్లోనే ఉన్నారని చెప్పారు. భూకంపం కారణంగా రష్యాలో అనేక భవనాలు కదిలాయి. దీంతో ప్రజలు భయంతో వణికిపోయారు.

Also Read: ఎకరం రూ.104 కోట్లు.. హైదరాబాద్‌లో భూముల వేలానికి ప్రభుత్వం నిర్ణయం.. ఫుల్ డీటెయిల్స్‌

రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. అక్కడి కొన్ని ప్రాంతాల్లో దాదాపు 10 అడుగులు ఎత్తున సునామీ అలలు కనపడ్డట్లు చెప్పారు.

జపాన్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. హొక్కైడో దక్షిణ తీరంలో ఉన్న టొకాచిలో 40 సెంటీమీటర్ల (1.3 అడుగులు) సునామీ అలలు కనపడ్డాయి. జపాన్‌లోని ఉత్తర భాగంలో ఉన్న ప్రధాన దీవుల్లో హొక్కైడో ఒకటి. మరికొన్ని దేశాల్లోనూ సునామీ అలలు ఎగిసిపడే ముప్పు ఉంది.

కాగా, సునామీ హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ… హవాయి ప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ అయ్యిందని తెలిపారు. అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకు కూడా ఈ ముప్పు ఉందని, ప్రజలు ధైర్యంగా ఉండాలని అన్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ట్రంప్ సూచించారు. అధికారుల సూచనలను ప్రజలు పాటించాలని చెప్పారు.

సునామీ ముప్పు నేపథ్యంలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌ జనరల్‌ ప్రజలకు సూచనలు చేసింది. కాలిఫోర్నియా, హవాయి సహా అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.

మరోవైపు, భారత్‌కు సునామీ ముప్పు ఏమీలేదని ఇండియన్ నేషనల్‌ సెంటర్ ఫర్‌ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) తెలిపింది.

చైనా కూడా సునామీ హెచ్చరిక జారీ చేసింది. చైనా సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకారం.. 30 సెం.మీ నుంచి 1 మీటరు ఎత్తున అలలు దేశంలోని తూర్పు తీరాన్ని తాకే అవకాశం ఉంది. చైనా తీర ప్రాంతాల్లో కొన్ని చోట్ల నష్టం వాటిల్లే అవకాశముంది.