Site icon 10TV Telugu

సర్వీసులోకి రోబో ‘ఆప్టిమస్’.. భవిష్యత్ అంతా రోబోలదే.. స్మార్ట్‌ఫోన్లు మన లైఫ్‌లోకి వచ్చేసినట్లు.. ఫ్యూచర్‌లో రోబోలు ఇలా..

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ అభివృద్ధి చేస్తున్న హ్యూమనాయిడ్ రోబో “ఆప్టిమస్” మరో టాలెంట్‌ను ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ రోబో ఒక వ్యక్తికి పాప్‌కార్న్ సర్వ్ చేస్తూ కనిపించింది.

“ఆప్టిమస్” రెండు పాప్‌కార్న్ ప్యాకెట్‌ను నింపి, తర్వాత కస్టమర్‌కు అందించింది. చివరగా ‘థంబ్స్ అప్’ ఇచ్చి, చేతిని ఊపుతూ అభివాదం తెలిపింది. అది పాప్‌కార్న్ అందించిన తీరు ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోపై ఓ యూజర్ స్పందిస్తూ.. “ఇది ఎక్కడ జరిగింది?” అని గ్రోక్ ని ప్రశ్నించాడు. దీంతో “లాస్ ఏంజలెస్‌లోని 7001 డబ్ల్యూ సాంటా మోనికా బులివార్డ్, టెస్లా డైనర్ సూపర్‌చార్జర్ స్టేషన్‌లో జరిగింది” అని గ్రోక్ తెలిపింది.

Also Read: ట్విటర్ సృష్టికర్త మరో సంచలనం.. రెండు కొత్త యాప్స్.. ఈ యాప్స్‌ వాడడానికి ఇంటర్నెట్ అక్కర్లేదు..

దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్ “మరి కొన్ని ఏళ్లలో ఇటువంటివన్నీ సర్వసాధారణమైపోతాయి” అని తెలిపారు. 2021లో టెస్లా బాట్ పేరుతో మొదలైన ఈ ప్రాజెక్ట్.. ఆ తర్వాత “ఆప్టిమస్”గా మారింది. “ఇవి ఏ పనులనైనా చేయగలవు” అని మస్క్ అప్పట్లో అన్నారు.

కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లడం, గడ్డి కోయడం, పిల్లలను సంరక్షించడం వంటి సాధారణ పనుల్ని భవిష్యత్‌లో ఈ రోబోలు చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2022లో తొలిసారిగా నడిచే ప్రోటోటైప్‌ను విడుదల చేశారు. వస్తువుల్ని ఎత్తడం, మొక్కలకు నీరు పోయడం వంటి పనులు చేసి చూపించారు.

మస్క్ 2024 జూలైలో కొత్త రోడ్‌మ్యాప్‌ను ప్రకటించి.. 2026 నాటికి కమర్షియల్ సేల్స్ మొదలవుతాయని చెప్పారు. అయితే అదే 2024 అక్టోబర్‌లో జరిగిన “We, Robot” ఈవెంట్‌లో, రోబోలు ఇంకా పూర్తి స్వయం నియంత్రణ సాధించలేదని తేలిపోయింది. అక్కడ ప్రదర్శించిన కొన్ని రోబోలు మానవుల ద్వారానే ఆపరేట్ అవుతుండటం దీనికి ఉదాహరణ.

ఇన్నాళ్లూ ఆప్టిమస్ చిన్న చిన్న డెమోలు ఇచ్చింది. ఇప్పుడు పాప్‌కార్న్ డెమోతో మరో అడుగు ముందుకు వేసింది. భవిష్యత్‌లో ఈ రోబోలు మన జీవితాల్లో స్మార్ట్‌ఫోన్‌లా భాగం అవుతాయని మస్క్ భావిస్తున్నారు.

Exit mobile version