X Banned Indian Accounts : గత నెలలో భారత్‌లో 1.8 లక్షల ‘ఎక్స్’ అకౌంట్లపై నిషేధం.. ఎందుకో తెలుసా?
X Banned Indian Accounts : పిల్లలపై లైంగిక దోపిడీ, తీవ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు ఎక్స్ ప్లాట్‌ఫారం 185,544 భారతీయ అకౌంట్లను నిషేధించింది. కొన్ని ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు కొన్ని అకౌంట్ సస్పెన్షన్‌లను రద్దు చేసింది.

X banned over 1.8 lakh accounts ( Image Credit : Google )
X Banned Indian Accounts : మార్చి 26 నుంచి ఏప్రిల్ 25 మధ్య భారత్‌లో 184,241 అకౌంట్లను నిషేధించామని ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని X (గతంలో ట్విట్టర్) తెలిపింది. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ అదే సమయంలో దేశంలో 1,303 అకౌంట్లను తొలగించింది. మొత్తంగా, రిపోర్టింగ్ వ్యవధిలో 185,544 అకౌంట్లను నిషేధించింది. ఎందుకు ఈ అకౌంట్లను ఎక్స్ నిషేధించిందంటే.. కంపెనీ ప్రకారం, పిల్లలపై లైంగిక దోపిడీ, అడల్ట్ కంటెంట్ ప్రోత్సహించినందుకు చాలా అకౌంట్లను నిషేధించింది.
దేశంలో ప్లాట్‌ఫారమ్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు కొన్ని హ్యాండిల్స్‌ను నిషేధించింది. కొత్త ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా నెలవారీ నివేదికలో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం భారత్‌లో యూజర్ల నుంచి ఒకే సమయంలో 18,562 ఫిర్యాదులను అందుకుంది. అకౌంట్ సస్పెన్షన్‌లను అప్పీల్ చేస్తున్న 118 ఫిర్యాదులను ఎక్స్ ప్రాసెస్ చేసింది. ఆ తర్వాత వీటిలో 4 అకౌంట్ సస్పెన్షన్‌లను రద్దు చేసింది. మిగిలిన రిపోర్టు చేసిన అకౌంట్లను తాత్కాలికంగా నిలిపివేయాలని కంపెనీ తెలిపింది.
ఈ రిపోర్టింగ్ వ్యవధిలో అకౌంట్లకు సంబంధించిన సాధారణ ప్రశ్నలకు సంబంధించిన 105 అభ్యర్థనలను స్వీకరించినట్టు ఎక్స్ పేర్కొంది. భారత్ నుంచి చాలా ఫిర్యాదుల్లో నిషేధం ఎగవేత (7,555), తర్వాత ద్వేషపూరిత ప్రవర్తన (3,353), అడల్ట్ కంటెంట్ (3,335) దుర్వినియోగం/వేధింపులు (2,402) వంటివి ఉన్నాయి. ‘ఎక్స్’ చివరి రిపోర్టులో దేశంలో 2,12,627 అకౌంట్లను నిషేధించింది (ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 మధ్య) మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు 1,235 అకౌంట్లను కూడా తొలగించింది.
ఇటీవల, స్పామ్, బాట్‌లను నివారించడానికి ధృవీకరించిన యూజర్లను మాత్రమే రిప్లయ్ ఇచ్చేలా పరిమితం చేసినట్టు మస్క్ ప్రకటించారు. అయితే, కామెంట్ సెక్షన్‌లో మాత్రమే స్పామ్‌ను నిరోధించడానికి వెరిఫైడ్ యూజర్లకు రిప్లయ్ పరిమితం చేయాలని ఒక యూజర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. మీ రిప్లయ్ క్వాలిటీని మెరుగుపరుస్తుందంటూ బదులిచ్చారు.