Godfather of AI: ఏఐ ఛాట్‌బాట్స్ వల్ల పెను ప్రమాదం: కృత్రిమ మేధకు గాడ్‌ఫాదర్‌లాంటి హింటన్ వార్నింగ్

Godfather of AI: గూగుల్‌కు జాఫ్రీ హింటన్ రాజీనామా చేశారు. కృత్రిమ మేధ (Artificial intelligence-AI)ను అంతగా అభివృద్ధి చేసిన జాఫ్రీ హింటన్ మళ్లీ దాని గురించే ఎందుకు హెచ్చరిక చేస్తున్నారు?

Godfather of AI: జాఫ్రీ హింటన్ (Geoffrey Hinton)… ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఉన్న కృత్రిమ మేధ (Artificial intelligence-AI)కు ఆ 75 ఏళ్ల వ్యక్తి గాడ్‌ఫాదర్ లాంటివారు. తాజాగా, గూగుల్‌(Google)కు ఈ శాస్త్రవేత్త రాజీనామా చేశారు. ఆయన ప్రపంచానికి కృత్రిమ మేధ గురించి ఓ వార్నింగ్ ఇస్తున్నారు.

ఏఐ ఛాట్‌బాట్స్ (AI chatbots) వల్ల పెను ప్రమాదం పొంచి ఉంటుందని జాఫ్రీ హింటన్ చెప్పారు. ప్రస్తుతం టెక్ దిగ్గజాలు అన్నీ ఛాట్ జీపీటీ (ChatGPT) వంటి ఏఐపైనే దృష్టి పెట్టాయి. కృత్రిమ మేధకు సంబంధించిన అన్ని రకాల పరిశోధనల కోసం భారీగా ఖర్చుచేస్తున్నాయి. ఎన్నో పరిశోధనలు చేస్తూ పోటీ పడుతున్నాయి.

ఛాట్ జీపీటీ (ChatGPT)కి పోటీగా గూగుల్ కూడా సొంత ఛాట్‌బాట్ “బార్డ్”ను ప్రవేశపెట్టింది. ఈ కృత్రిమ మేధ ఛాట్‌బాట్లు అద్భుతాలు సృష్టిస్తోంది. మనం ఓ కవిత రాయాలని చెబితే కవితలు రాస్తున్నాయి. ఏదైనా అడిగితే కచ్చితత్వంతో సమాధానాలు ఇస్తున్నాయి. మనం ఒత్తిడిలో ఉండి సాయం కోరితే దాని నుంచి బయటపడడానికి మనకు చక్కని సలహాలు ఇవ్వగలుగుతున్నాయి.

ఇది ఇక్కడితో ఆగదని మనుషుల కంటే తెలివిగా మారగలవని, మనకే ముప్పుగా పరిణమించే ప్రమాదమూ ఉందని జాఫ్రీ హింటన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇవి ఇంతగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశానని, అయితే, అందుకు ఇప్పుడు విచారిస్తున్నానని అన్నారు.

“ఇప్పటివరకైతే అవి మనకంటే తెలివైనవేమీ కాదు. అయితే, త్వరలోనే అవి మనకంటే తెలివైనవిగా మారతాయని చెప్పగలను” అని జాఫ్రీ హింటన్ అన్నారు. తన వయసు 75 అని పదవీ విరమణ చేయాల్సి రావడంతోనే చేశానని చెప్పారు. మనిషి మెదడు కంటే చురుకుగా సమాచారాన్ని విశ్లేషించే స్థాయికి ఛాట్‌బాట్ చేరుకుంటుందని అన్నారు. మనిషి నుంచి మరొక మనిషికి సమాచారం అందాలంటే సమయం పడుతుంది. ఛాట్‌బాట్ కృత్రిమ మేధ మాత్రం ఎంతటి సమాచారాన్నైనా క్షణాల్లో ఎన్నిసార్లైనా కాపీ చేసుకుని నిక్షిప్తం చేసుకోగలదు.

ఛాట్‌బాట్ శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని జాఫ్రీ హింటన్ చెప్పారు. కృత్రిమ మేధను ఉపయోగించుకుని నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడవచ్చని అన్నారు. “నాకు మరింత శక్తి కావాలి” అనే సబ్ గోల్స్ ఛాట్‌బాట్లు అలవరుచుకునే ప్రమాదం ఉందని చెప్పారు. ఇటువంటి ఇంటెలిజెన్స్ ను మనం అభివృద్ధి చేస్తున్నామని, ఇది మనిషికి ఉన్న ఇంటెలిజెన్స్ కంటే ప్రత్యేక ప్రత్యేకమని అన్నారు.

మనం జీవవ్యవస్థలకు చెందినవారిమని, కృత్రిమ మేధ డిజిటల్ వ్యవస్థలకు చెందిందని జాఫ్రీ హింటన్ గుర్తు చేశారు. కృత్రిమ మేధ వల్ల మనుషులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదమూ ఉందని అన్నారు. గూగుల్ ను తాను విమర్శించడం లేదని, ఆ సంస్థ బాధ్యతాయుతంగానే ఉందని చెప్పారు. మరోవైపు, తాము చాలా బాధ్యతాయుతంగానే కృత్రిమ మేధను అభివృద్ధి చేస్తామని గూగుల్ సంస్థ చెబుతోంది.

Pixel 6a Discount Sale : రూ.27వేల లోపు ధరకే పిక్సెల్ 6a ఫోన్ సొంతం చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

ట్రెండింగ్ వార్తలు