Bans Import Laptops : ల్యాప్‌టాప్‌ల దిగుమతిపై ఆంక్షలు.. విదేశాల్లో కొనుగోలు చేసిన వాటిని మీవెంట తెచ్చుకోవాలంటే ఇలా చేయాలి
ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం గురువారం ఆంక్షలు విధించింది.

Bans Import Laptops
Bans Import Laptops : ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం గురువారం ఆంక్షలు విధించింది. వాటి దిగుమతులను నిలిపివేశామని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. పరిమిత దిగుమతులకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ పొందితేనే ఈ ఉత్పత్తుల దిగుమతికి అవకాశం కల్పిస్తామని కేంద్ర పేర్కొంది. స్థానికంగా తయారీని ప్రోత్సహించేందుకు ప్రయత్నంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో భారత్‌లోని ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో కీలక భూమిక పోషిస్తున్న డెల్, హెచ్‌పీ, ఏసర్, శాంసంగ్, పానసోనిక్, యాపిల్, లెనోవో వంటి కంపెనీలపై ప్రభావం పడనుంది. మరోవైపు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, పర్సనల్, ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు, సర్వర్లు వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించడంతో భారత్‌లోకి ఈ వస్తువులను తీసుకొచ్చి విక్రయించాలంటే ఆయా వస్తువుల షిప్మెంట్ కోసం కేంద్రం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. లేదా లైసెన్స్ పొందిఉండాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం తాజా ఆంక్షల్లో కొన్నింటికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఈ కామర్స్ పోర్టల్స్‌లో కొనుగోలు చేసి పోస్టు, కొరియర్ ద్వారా దిగుమతి చేసుకునే వాటికి ఈ ఆంక్షలు వర్తించవు. అదేవిధంగా మీరు విదేశాలకు వెళ్లి తిరిగొచ్చేటప్పుడు ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు, పర్సనల్ కంప్యూటర్ను తెచ్చుకోవచ్చు. అయితే, భారత్‌లోకి ప్రవేశించే ప్రతీ ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తారు. ఆ సమయంలో మీరు విదేశాల నుంచి తీసుకొచ్చే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు వంటివి కొనుగోలు చేసిన వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను కస్టమ్స్ అధికారులకు చూపిస్తే అనుమతిస్తారు.
క్లుప్తంగా చెప్పాలంటే.. మీరు మీ వ్యక్తిగత వినియోగంకోసం, బహుమతి ప్రయోజనాలకోసం ఆంక్షలు విధించిన పరికరాన్ని తీసుకురావచ్చు. కానీ, మీరు దానిని భారత్‌లో విక్రయించలేరు. దీనికి అదనంగా మీరు వీటిని భారతదేశానికి తీసుకురావడానికి కస్టమ్స్ డ్యూటీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా రీసర్చ్, టెస్టింగ్, ఎవాల్యుయేషన్, రిపెయిర్, రీ ఎక్స్పోర్ట్ తో పాటు ప్రొడెక్ట్ డెవలప్మెంట్ లో భాగంగా ల్యాప్‌టాప్, ట్యాబ్స్, పర్సనల్ కంప్యూటర్లను దిగుమతి చేసుకోవాలనుకునేవారిపై కూడా ఈ ఆంక్షలు వర్తించవు. అయితే, వీరు ఒక్కో రవాణాకు 20 వస్తువుల వరకు దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తాయి. మీరు భారతదేశానికి తీసుకువచ్చిన పరికరాలను ఎట్టిపరిస్థితుల్లో విక్రయించరాదు. తిరిగి ఎగుమతి చేయాలి లేదా నాశనం చేయాల్సి ఉంటుంది.