IndiaAI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ 2026లో భారత్ సరికొత్త రికార్డు.. 24 గంటల్లో 2.5 లక్షల ప్రతిజ్ఞలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్..!
IndiaAI Impact Summit 2026 : ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భారత్ కొత్త రికార్డును నెలకొల్పింది. 24 గంటల్లోనే, 250,946 మంది ఏఐ ప్రతిజ్ఞ చేయడంతో భారత్ గిన్నిస్ రికార్డును సాధించింది.
IndiaAI Impact Summit 2026
- ఇండియా ఏఐ సమ్మిట్ 2026లో భారత్ రికార్డు
- 24 గంటల్లోనే, 250,946 మంది ఏఐ ప్రతిజ్ఞలతో గిన్నిస్ రికార్డు
- పాల్గొన్న వారందరికీ ఆన్లైన్ బ్యాడ్జ్‌లు ప్రధానం
- పీఎం మోదీకి పూర్తి క్రెడిట్ ఇచ్చిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
IndiaAI Impact Summit 2026 : ప్రతిష్ఠాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. శిఖరాగ్ర సమావేశం జరిగిన 24 గంటల్లోనే 250,946 మంది ఏఐ ప్రతిజ్ఞ చేయడంతో భారత్ అత్యధిక సంఖ్యలో ఏఐ ప్రతిజ్ఞలతో గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించింది.
ఏఐ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వినియోగిస్తామని అతి తక్కువ సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు ఏఐ ప్రతిజ్ఞ స్వీకరించడంతో ఈ రికార్డు సాధ్యమైంది. ఈ చొరవకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పీఎం మోదీకి పూర్తి క్రెడిట్ ఇచ్చారు. పూర్తి వివివరాలను అన్వేషిద్దాం..
కేవలం 24 గంటల్లోనే 250,946 మంది ప్రతిజ్ఞ :
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా, 24 గంటల్లోనే మొత్తం 250,946 మంది ఏఐ ప్రతిజ్ఞను స్వీకరించారు. ఈ చొరవకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పీఎం ప్రధానికి పూర్తి క్రెడిట్ ఇచ్చారు. ఏఐ గురించి అవగాహన పెంచడం ఏఐ ప్రతిజ్ఞ లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందులో పాల్గొనే వారందరికీ ఆన్లైన్ బ్యాడ్జ్‌లు అందుతాయని ప్రకటించారు.
ఏఐ ప్రతిజ్ఞల కోసం అధికారిక పోర్టల్ :
ఇండియా ఏఐ మిషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఏఐ రెస్పాన్సిబిలిటీ ప్రతిజ్ఞల కోసం కేంద్రం ఏఐ ఇంపాక్ట్ పోర్టల్‌లో ఒక మైక్రోసైట్‌ను క్రియేట్ చేసింది. ఈ పోర్టల్ సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ప్రజలకు అందుబాటులో ఉంది. ఇంటెల్ ఇండియా కంపెనీ భాగస్వామ్యంతో ఫిబ్రవరి 16న ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. నైతికంగా, బాధ్యతాయుతంగా ఏఐ టెక్నాలజీని వాడుతామని లక్షలాది మంది భారతీయులు ప్రతిజ్ఞ చేశారు.
ఈ ప్రతిజ్ఞలన్నింటిని ఏఐ ప్లెడ్జ్ ఇండియా అధికారిక వెబ్సైట్ (aipledge.indiaai.gov.in)లో రిజిస్టర్ అయ్యాయి. డేటా ప్రైవసీ, పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహార శైలికి సంబంధించి అనేక ప్రశ్నలను అడిగారు.
తప్పుడు సమాచారంపై పోరాటం, మానవ కేంద్రిత ఏఐ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రజలతో ప్రతిజ్ఞలు చేయించారు. ఈ ప్రతిజ్ఞలు చేసిన వారందరికీ డిజిటల్ బ్యాడ్జీలతో పాటు ఏఐ స్కిల్స్ లెర్నింగ్ కోర్సులను కూడా ప్రదానం చేసినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఫిబ్రవరి 21కి పొడిగింపు :
భారత్‌లో ఫస్ట్ టైమ్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోంది. మొదట ఫిబ్రవరి 20 వరకు జరగాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఒక రోజు పొడిగించాలని నిర్ణయించింది. అంటే.. ఫిబ్రవరి 21 వరకు ఈ ఏఐ సమ్మిట్ కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఏఐ కంపెనీల సీఈఓలు ఈ కార్యక్రమంలో పాల్గొని దేశీయ ఏఐ, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించారు. అందులో ప్రధానంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ కూడా ఉన్నాయి.
వివాదంలో చైనా రోబో :
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా, గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్శిటీ ఒక చైనీస్ రోబోట్‌ను ప్రదర్శించింది. అయితే, ఇది వివాదానికి దారితీసింది. సోషల్ మీడియా వినియోగదారులు యూనివర్శిటీ రోబోట్ కుక్కను క్రియేట్ చేసిన వాదనలు అవాస్తవమని పేర్కొన్నారు. అయితే, యూనివర్శిటీ అలాంటి వాదన ఏమీ చేయలేదని స్పష్టం చేసింది.
